టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల గుండెపోటుతో మృతి..

తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య హైదరాబాదు ఆపోలో ఆస్పత్రిలో గుండె పోటుతో మృతి చెందారు. చిరకాలం పాటు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) తరపున రాజకీయాల్లో పని చేసిన నోముల నర్సింహయ్య కొన్నేళ్ళ క్రితం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ.. 2018 ఎన్నికల్లో శాసనసభకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన నాగార్జున సాగర్ నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా.. కొద్ది నెలలుగా నోముల అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్ అపోలో ఆసుపత్రితో చికిత్స పొందుతున్న నోముల.. మంగళవారం తెల్లవారుజామున గుండెపోటు వచ్చి మరణించారు.

నకిరేకల్ కోర్టులో న్యాయవాదిగా పని చేసిన నోముల ఆ తర్వాత అక్కడి నుంచే సీపీఎం పార్టీ తరపున శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. 1999, 2004లో సీపీఎం పార్టీ తరపున అసెంబ్లీకి ఎన్నికైన నోముల.. 2013లో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2014లో నాగార్జున సాగర్ నుంచి పోటీ చేసిన నోముల.. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. తిరిగి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో జానారెడ్డిపై అనూహ్య విజయం సాధించి.. మరోసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు.