నువ్వు మా దరిద్రం జగన్ స్టిక్కర్లు విడుదల..

  • లబ్ధిదారుల నుదుటిపై జగన్ బొమ్మతో పచ్చబొట్టు కూడా వేస్తారేమో?
  • చాక్లెట్ ఇచ్చి నక్లెస్ దోచుకున్నట్లుగా సంక్షేమ పథకాలు
  • ప్రజల కట్టిన పన్నులోంచి పథకాల రూపంలో కాస్త ఇస్తూ తామేదో ప్రజల్ని ఉద్దరిస్తున్నట్లు వైసీపీ నేతలు ప్రచారం సిగ్గుచేటు
  • వైసీపీ నేతలే ప్రజలు కట్టిన పన్నుతోనే తాము విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నామని గ్రహిస్తే మంచిది
  • ప్రజలతో క్షేత్రస్థాయిలో మమేకం అవుతూ వైసీపీ దాష్టీకాలపై అవగాహన తీసుకువస్తాం
  • నువ్వే మా నమ్మకం జగన్ అంటూ ఇంటింటికి స్టిక్కర్లు అతికించటంపై జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి ఆగ్రహం

గుంటూరు: సంక్షేమ పథకాలను అందుకుంటున్న ఇళ్లకు వాలంటీర్లతో మా నమ్మకం నువ్వే జగన్ అంటూ స్టిక్కర్లు అతికించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ద్వారా ఓటమి భయంతో వైసీపీ ప్రభుత్వం ఎంతగా ఆందోళన చెందుతుందో అర్ధమవుతుందని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. తన పాలనపై ప్రజలు నమ్మకం కోల్పోయారని గ్రహించిన జగన్ కి మతిభ్రమించి ఇలాంటి తుగ్లక్ నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం శ్రీనివాసరావుతోటలోని గాజుగ్లాస్ దిమ్మెవద్ద నువ్వు నిన్ను మేం నమ్మం.. మా దరిద్రం నువ్వే జగన్ అంటూ స్టిక్కర్లను విడుదల చేసారు. ఈ సందర్భంగా ఆళ్ళ హరి మాట్లాడుతూ సంక్షేమ పధకాలు ఇస్తున్న ఇళ్ళకి ఇప్పుడు స్టిక్కర్లు మాత్రమే వేస్తున్నారని రానున్న రోజుల్లో పథకాలు అందుకుంటున్న వారి నుదుటి మీద జగన్ బొమ్మతో పచ్చ బొట్టు కూడా వేస్తారేమోనని ఎద్దేవా చేశారు. అసలు సంక్షేమ పథకాలకు ఆద్యుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య అన్నారు. సంక్షేమ పథకాలను జగన్ రెడ్డే ప్రవేశపెట్టినట్లు వాటికి పేటెంట్ హక్కు తమదే అన్నట్లుగా వైసీపీ నేతలు వ్యవహరించటం సిగ్గుచేటన్నారు. ప్రజల సొమ్ముని ప్రజలకే పంచుతూ మీరేదో మీ జేబులో డబ్బులు పంచుతున్నట్లుగా ప్రచారం చేసుకోవటం హేయమన్నారు. పది రూపాయలు సబ్బు కొంటె రూపాయి టాక్స్ వసూలు చేస్తారు, రూపాయి చాక్లెట్ కొన్నా అందులో పది పైసలు ప్రభుత్వం టాక్స్ వసూలు చేస్తుందన్నారు. పీల్చే గాలికి మినహా మనిషి నిత్యావసరాలకు వాడే ప్రతీదాంట్లో ప్రభుత్వం పన్ను వసూలు చేస్తుందన్నారు. చిన్నపిల్లలకి చాక్లెట్ ఇచ్చి నక్లెస్ లాక్కున్నట్లుగా రాష్ట్ర ఆదాయంలోంచి ప్రజలకు కాస్త పంచిపెట్టి తాము మాత్రం రాష్ట్ర సంపదను ఇష్టానుసారంగా దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. తాము లేకపోతే ప్రజలకు బ్రతుకే లేదన్నట్లుగా వైసీపీ నేతలు భ్రమిస్తున్నారని దుయ్యబట్టారు. ఈ స్టిక్కర్లు అతికించటం వెనుక రాజకీయ కుట్రలు కూడా దాగున్నాయన్న అనుమానం కలుగుతుందన్నారు. ఎవరైనా ఈ స్టిక్జర్లను తమ ఇళ్లకు అతికించవద్దు అంటే వారిని టార్గెట్ చేసి పలువిధాలుగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని, వారి ఓట్లను కూడా తొలగించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపధ్యంలో వాలంటీర్లు మనసుతో పనిచేయాలని, రాష్ట్ర ప్రజల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ దాష్టీకాలపై ప్రజల్లో అవగాహన తీసుకురావాలని కోరారు. తాము కూడా ప్రజల అనుమతితో నువ్వే మా రాష్ట్రానికి మా జీవితాలకి పట్టిన దరిద్రం జగన్ స్టిక్కర్లను ఇళ్లకు అతికిస్తామన్నారు. వైసీపీ నేతల దుర్మార్గాలపై, అవినీతిపై, దోపిడీపై, చేతకాని పరిపాలనపై అవగాహన కల్పించేందుకు క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకం అయ్యేలా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆళ్ళ హరి అన్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు సయ్యద్ షర్ఫుద్దీన్, రామిశెట్టి శ్రీను, నండూరి స్వామి, సయ్యద్ రఫీ, మెహబూబ్ బాషా, దాసరి రాము, సెంట్రింగ్ వెంకటేశ్వరరావు, శెట్టి శ్రీను, పట్టంశెట్టి కోటి, షేక్ బాషి తదితరులు పాల్గొన్నారు.