తెలంగాణకు రెండు రోజుల వర్ష సూచన

తెలంగాణ వ్యాప్తంగా ఆది, సోమవారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే గంటకు 30 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. శుక్రవారం ఏర్పడిన అల్పపీడనం వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్‌, ఒడిశా ప్రాంతాల మీదుగా కొనసాగుతుందని పేర్కొంది.

దీనికి అనుబంధంగా.. మధ్య ట్రోపోస్ఫియర్ స్థాయి వరకు ఉపరితల ఆవర్తనం వ్యాపించినట్లు చెప్పింది. రానున్న రోజుల్లో మరింత బలపడి పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి ఒడిశా, జార్ఖండ్,ఉత్తర ఛత్తీస్‌గఢ్‌ మీదుగా వెళ్లే అవకాశం ఉన్నట్లు చెప్పింది. ఉత్తర పశ్చిమ ద్రోణి, అల్పపీడన ప్రాంతం నుంచి దక్షిణ ఛత్తీస్‌గఢ్, విదర్భ, ఉత్తర, మధ్య మహారాష్ట్ర మీదుగా అరేబియా సముద్రం వరకు 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఏర్పడినట్లు పేర్కొంది.