స్టైలిష్ స్టార్ కు ఉదయ్ పూర్ ఎయిర్ పోర్ట్ అధికారుల మన్ననలు

మెగా ఫ్యామిలీ సపోర్ట్ తో తెరంగేట్రం చేసినా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకొని స్టైలిష్ స్టార్ గా కీర్తింపబడుతున్న అల్లు అర్జున్ కి యువతలో విపరీతమైన క్రేజ్ ఉంది. తాజాగా మెగా బ్రదర్ నాగబాబు గారాల పట్టీ నిహారిక, చైతన్యల వివాహ వేడుకలో పాల్గొనేందుకు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వెళ్లిన బన్నీ.. అక్కడి ఎయిర్‌పోర్టు అధికారుల మన్ననలను పొందారు.

వివరాల్లోకి వెళితే… ఉదయ్‌పూర్‌లోని హోటల్ ది ఒబెరాయ్ ఉదయ్‌విలాస్‌లో జరిగిన నిహారిక, చైతన్య పెళ్లిలో పాల్గొనడానికి అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి ప్రత్యేక విమానంలో వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే, విమాన ప్రయాణ సమయంలో అల్లు అర్జున్ కనబరిచిన క్రమశిక్షణ ఎయిర్‌పోర్టు అధికారులను ఆశ్చర్యపరిచింది. కొవిడ్-19 నిబంధనలను పాటిస్తూ ప్రయాణంలోనూ మాస్క్ ధరించి మరికొందరికి స్ఫూర్తిగా నిలిచిన అల్లు అర్జున్‌కు ఉదయ్‌పూర్ ఎయిర్‌పోర్టు అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. బన్నీకి థ్యాంక్స్ చెబుతూ ఉదయ్‌పూర్ ఎయిర్‌పోర్టు అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ట్వీట్ చేశారు. ఎయిర్‌పోర్టు అధికారిణితో కలిసి బన్నీ తీసుకున్న ఫొటోను షేర్ చేస్తూ.. ”మా ప్రయాణికులు సురక్షితంగా ప్రయాణం చేయాలని మేం కోరుకుంటాం. అలాగే, వారు కూడా నిబంధనలను పాటించడం ద్వారా మేం సుక్షితంగా ఉండటానికి సహాయపడతారు. మరిచిపోకుండా మాస్క్‌లు ధరిస్తున్న అందరికీ కృతజ్ఞతలు” అని అల్లు అర్జున్‌ను ట్యాగ్ చేసి పేర్కొన్నారు. ఉదయ్‌పూర్‌లో సైతం అల్లు అర్జున్‌పై ప్రశంసల వర్షం కురవడంపై ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఎయిర్‌పోర్టు అధికారులు మాత్రమే కాదు.. బన్నీ ఫ్యామిలీ స్టే చేసిన స్టార్ హోటల్ సిబ్బంది కూడా ఆయన్ని సర్‌ప్రైజ్ చేశారు. అల్లు అర్జున్ హిట్ సినిమా టైటిల్స్‌తో ఎంబ్రాయిడరీ చేసిన కుషన్స్‌ని గదిలో ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాటుచేశారు. ఈ విషయాన్ని అల్లు అర్జున్ భార్య స్నేహ సోషల్ మీడియా ద్వారా ఇప్పటికే పంచుకున్న విషయం అందరికీ తెలిసిందే.