రియల్ ఎస్టేట్ వ్యాపారంలా ఇక్కడ వేల కోట్ల రూపాయల టర్నోవర్ ఉండదు.. పవన్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో సీఎం  కేసీఆర్ పిలుపు మేరకు సినీ తారలు కొందరు వరద బాధితులను ఆదుకొనేందుకు తెలంగాణ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు విరాళాలు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే కొందరు ఇలాంటి పరిస్థితుల్లో కూడా విరాళాలు ఇవ్వరా..? అంటూ సినిమా వాళ్లని టార్గెట్‌ చేస్తూ కామెంట్స్‌ చేస్తున్న తరుణంలో.. అలాంటి కామెంట్స్‌పై తాజాగా పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. సినిమా రంగంలోని వారికి పేరేమో ఆకాశానికి అన్నట్లు ఉంటుంది కానీ డబ్బు ఆ స్థాయిలో ఉండదు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలా ఇక్కడ వేల కోట్ల రూపాయల టర్నోవర్ ఉండదు.. ఇలాంటి కామెంట్స్‌ చేసే వారు జేబులో నుంచి పది రూపాయలు ఇవ్వడానికి మనసు రాదు కానీ.. కామెంట్స్‌ మాత్రం చేస్తుంటారని అన్నారు.

ఇంకా పవన్ మాట్లాడుతూ.. ”చిత్ర పరిశ్రమలో చాలా సంపద ఉంటుందని అభిప్రాయం సాధారణ ప్రజానీకంలో ఉంది. విపత్తులు జరిగినప్పుడు సినిమా పరిశ్రమ స్పందిస్తూనే ఉంది. విరాళాలు ఇస్తూనే ఉన్నారు. కానీ సరిపోయినంత ఇవ్వడం లేదనే విమర్శ కూడా ఉంది. అసలు సరిపోయినంత ఇవ్వడం లేదని నిర్ధారించేది ఎవరు? సరిపోయినంత ఇవ్వడం లేదని నిర్ధారించే వాళ్లు వారి జేబుల నుంచి పది రూపాయలైన తీసి ఇచ్చారా? కష్టపడి పని చేసి సంపాదించిన డబ్బు నుంచి కోటి రూపాయలు, పది లక్షలు రూపాయలు విరాళాలుగా ఇవ్వాలంటే అలాంటివారికి మనసు ఒప్పుతుందా? అలాంటిది నా వరకు నేను తీసుకుంటే కొన్ని కోట్లు విరాళాలు ఇచ్చాను. అలా చేయాలంటే చాలా పెద్ద మనసు కావాలి. చిత్ర పరిశ్రమలో పేరున్నంతగా డబ్బు ఉండదు. ఆరెంజ్ సినిమాకు నష్టం వస్తే అప్పులు తీర్చడానికి ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది. అత్తారింటికి దారేది సినిమా విడుదలకు ముందే పైరసీకి గురయి నెట్ లో రిలీజ్ అయితే కొనటానికి ఎవరూ ముందుకు రాలేదు. గ్యారంటీ సంతకాలు చేసి రిలీజ్ చేయాల్సి వచ్చింది. సినీ పరిశ్రమలో ఇన్ని కష్టనష్టాలు ఉంటాయని పవన్ తెలిపారు.