ఊహకందని వ్యూహం – అదే జనసేనాని రాజకీయ మంత్రం

  • ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసమే జనసేనాని చారిత్రక నిర్ణయం
  • పవన్ కళ్యాణ్ నిర్ణయాలను ప్రశ్నించే అర్హత ఎవరికీ లేదు
  • ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్

తిరుపతి: జనసేనాని పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయాలను ప్రశ్నించే అర్హత ఎవరికీ లేదని ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఆయన చారిత్రక నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. ఊహకందని వ్యూహాలతో సరికొత్త రాజకీయ మంత్రాన్ని వచ్చే ఎన్నికల్లో ప్రయోగించబోతున్నారన్నారు. కానీ కొంత మంది వ్యక్తులు, నాయకులు జనసేనాని నిర్ణయాన్ని తప్పుబట్టడం బాధాకరమన్నారు. ఆయన తీసుకునే నిర్ణయాలు రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసమే అని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. పార్టీ పెట్టి సొంత డబ్బుతో ఎన్నో కార్యక్రమాలు చేసిన మంచి వ్యక్తిత్వం ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ అన్నారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు పట్టించుకోని వారంతా ఇప్పుడు అవాకులు చెవాకులు పేలితే వారికి సరైన బుద్ది చెబుతామన్నారు. రబ్బరు చెప్పులు వేసుకున్న వారిని రాజకీయ నాయకులను చేసిన ఘనత పవన్ కళ్యాణ్ కే దక్కుతుందన్నారు. తాడేపల్లిగూడెం సభలో ఓ పక్క అధికారాన్ని అనుభవించిన టిడిపి నేతలు కూర్చుంటే… వారితో సమానంగా రబ్బరు చెప్పులు వేసుకున్న నాయకులను పవన్ కళ్యాణ్ వేదికపై కూర్చోబెట్టారన్నారు. పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకున్నా నిజమైన జనసైనికుడు తప్పుబట్టరన్నారు. వైసిపితో రహస్య ఒప్పందం చేసుకొని జనసేనాని రాజకీయ చరిష్మా తగ్గించాలని కొందరు కుట్రలు పన్నుతున్నారన్నారు. అధికారమే కావాలనుకుంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడో అధికారంలోకి వచ్చేవారని తెలిపారు. కానీ రాష్ట్రం బాగుండాల‌ని, రాష్ట్ర ప్రజలు బాగుండాలని కోరుకున్నారు కాబట్టే చారిత్రక నిర్ణయం తీసుకున్నారన్నారు. ఇకపై జనసేనానిపై విమర్శలు చేసే వారు నోరు అదుపులో పెట్టుకోవాలని ఆయన ఆ పత్రికా ప్రకటనలో హెచ్చరించారు.