అర్బన్ రీ- సర్వేలో ప్రభుత్వ ఆస్తులను కాపాడాలి

  • 1905 ఎంక్రోచ్మెంట్ యాక్ట్ ప్రకారం బౌండరీలు ఏర్పాటు చేయాలి
  • ఆక్రమణలు తొలగించి కబ్జాదారులపై క్రిమినల్ చర్యలు చేపట్టాలి
  • 1958 సర్వే సెటిల్మెంట్ రికార్డులు ఆధారంగా పోరంబోకు భూములు గుర్తించాలి
  • కోట్లాది రూపాయల విలువైన చెరువులు, ప్రభుత్వ స్థలాలను పాత రికార్డులు ప్రకారం గుర్తించి, రక్షించాలి
  • రీ సర్వే మొక్కుబడి కాకూడదన్న ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు వంగల దాలి నాయుడు

పార్వతీపురం: ప్రస్తుతం ప్రభుత్వం చేపడుతున్న అర్బన్ రీ సర్వేలో ప్రభుత్వ ఆస్తులైన చెరువులు, ఖాళీ స్థలాలు, ప్రభుత్వ భవనాలు, శ్మశాన వాటికలు తదితర వాటిని కాపాడాలని ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షులు వంగల దాలి నాయుడు కోరారు. గురువారం ఆ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గవిరెడ్డి రఘు, సత్య సింహా చక్రవర్తి, పార్వతీపురం మండల అధ్యక్షులు బలగ శంకరరావు, ఉపాధ్యక్షులు అన్నాబత్తుల దుర్గాప్రసాద్ తదితరులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న అర్బన్ రీ సర్వే లో ప్రభుత్వ ఆస్తులను కాపాడాలన్నారు. 1905 ఎంక్రోచ్మెంట్ యాక్ట్ ప్రకారం రిసర్వే నిర్వహించి ప్రభుత్వ స్థలాలు, చెరువులకు బౌండరీలు గుర్తించాలన్నారు. రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీ మున్సిపాలిటీలకు చెందిన ఆయా శాఖలు సమన్వయంతో వారి వారి పాత రికార్డుల ప్రకారం ఈ సర్వే నిర్వహించి ప్రభుత్వాస్తులను కాపాడాలన్నారు. 1958 సర్వే సెటిల్మెంట్ రికార్డులు ఆధారంగా పోరంబోకు భూములను గుర్తించాలన్నారు. దీనిలో భాగంగా కోట్లాది రూపాయలు విలువైన చెరువులు, ప్రభుత్వం స్థలాలను ఆయా పాత రికార్డుల ప్రకారం గుర్తించి వాటికి రక్షణ ఏర్పాట్లు చేయాలన్నారు. ఆయా ఆస్తులను, చెరువులను కబ్జా చేసిన కబ్జాదారులపై చట్ట ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఆక్రమణలు తొలగించి ప్రకృతి వనరులను తిరిగి ప్రకృతికి ఇవ్వాలన్నారు. ముఖ్యంగా రీ సర్వే మొక్కుబడి కాకూడదు అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కబ్జా చేసిన కబ్జా స్థలాల్లో, చెరువుల్లో నిర్మించిన భవనాలను అర్బన్ రీసర్వేలో తొలగించాలన్నారు. అంతేగాని వాటిని మినహాయించి సర్వే చేయ చేయకూడదన్నారు. ఒకవేళ అదే జరిగితే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని హెచ్చరించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు గుర్తించి పార్వతీపురం మన్యం జిల్లాలో జరుగుతున్న అర్బన్ రీ సర్వేలో భాగంగా 1905, 1958 రికార్డుల ప్రకారం రీ సర్వే జరిగేలా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయమై ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.