*జీవజాతులకు ప్రాణాపాయంగా ప్లాస్టిక్ వ్యర్దాలు
*ప్లాస్టిక్ వాడకంతో గాలి.. నీరు.. నేల సమస్తం విషతుల్యం
*ప్రతీ ఒక్కరూ చెట్లు నాటి వాటిని కన్న బిడ్డల్లా పెంచాలి
*పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యమే కీలకం
*స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాఒధ్ర కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటిన జిల్లా జనసేన అధికార ప్రతినిధి ఆళ్ళ హరి
భూమిపై నివసించే జీవజాతుల ఆరోగ్యానికి పెనుప్రమాదంగా మారిన ప్లాస్టిక్ భూతంపై అత్యవసర యుద్దాన్ని ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైందని గుంటూరు జిల్లా జనసేన అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ మూడో శనివారం చేపట్టిన స్వచ్చాంద్ర – స్వర్ణాఒధ్ర కార్యక్రమంలో భాగంగా స్థానిక శ్రీనివాసరావుతోటలో సచివాలయం సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. తొలుత ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా రాఘవయ్య పార్కులో జరిగిన యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వాటర్ ట్యాంక్ , వెంకటేశ్వరస్వామి దేవస్థానం పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్బంగా ఆళ్ళ హరి మాట్లాడుతూ ప్రజలు విచ్చలవిడిగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను ఉపయోగించటం వల్ల గాలి, నీరు, నేల సైతం విషతుల్యం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్లపై ఎక్కడపడితే అక్కడ విసిరేసిన ప్లాస్టిక్ కవర్లను తిని మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయని ఆవేదన చెందారు. రోజు రోజుకి పెరుగుతున్న క్యాన్సర్ మహమ్మారికి ప్లాస్టిక్ వ్యర్దాలు ప్రధాన కారణమన్నారు. ఇప్పటికే ఒక తరం ఆరోగ్యాన్ని కబలిస్తున్న ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించకపోతే భావితరాల ఆరోగ్యాన్ని దేవుడు కూడా కాపాడలేదన్నారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో పర్యావరణ పరిరక్షణలో ప్రజలు భాగస్వామ్యులు కావాలని కోరారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించటంతో పాటుగా ప్రతీ ఒక్కరూ చెట్లు నాటి వాటిని కన్నబిడ్డల్లా పెంచినప్పుడే ఈ మహమ్మారి నుంచి భావితరాలను కాపాడగలమని ఆళ్ళ హరి అన్నారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గేదెల నాగ రంగమణి, నోడల్ ఆఫీసర్ సతీష్, 70, 71 సచివాలయం సిబ్బంది వరలక్ష్మి, లింగయ్య, జాన్ వెస్లీ, మౌనిక, ప్రభు, బ్రాహ్మణి, సుజాత, దివ్య, లక్ష్మి, శ్రీవిద్య తదితరులు పాల్గొన్నారు.

Share this content:
Post Comment