మరి కాసేపట్లో తీరం దాటనున్న వాయుగుండం..

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరికాసేపట్లో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, నర్సాపూర్‌ల మధ్య కాకినాడకు దగ్గరలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వాయుగుండం తీరం దాటే సమయంలో కొన్ని చోట్ల పెనుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే, పూర్తిగా తీరం దాటాడానికి మరి కొంత సమయం పడుతుందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.

తీరం దాటిన తర్వాత తీవ్ర వాయుగుండం నుంచి వాయుగుండంగా మారి ఆ తర్వాత అల్పపీడనంగా మారుతుందని వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. తీరం వెంబడి 65 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. విజయనగరం నుంచి ప్రకాశం జిల్లా వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయ్యే అవకాశం ఉందని, ప్రజలు ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఏపీ విపత్తులశాఖ కమిషనర్‌ కె.కన్నబాబు తెలిపారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికారులు, ప్రజలను అప్రమత్తం చేస్తున్నట్టు చెప్పారు. వాయుగుండం ప్రభావంతో కోస్తా, తెంగాణ, మహారాష్ట్రలోని విదర్భ, మరఠ్వాడా ప్రాంతాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.