విజయనగరం జిల్లా ఎస్.కోట నియోజకవర్గంలోని దారపర్తి గిరిజన పంచాయతీ పరిధిలోని కురిడి గ్రామాన్ని శుక్రవారం సందర్శించిన జనసేన పార్టీ సీనియర్ నాయకులు వబ్బిన సన్యాసి నాయుడు, మండల నాయకుడు కొల్లి సురేంద్రతో కలిసి స్థానిక గిరిజనులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గిరిజనుల సమస్యలు తెలుసుకున్న సన్యాసి నాయుడు, పోడు భూములకు సర్వే నిర్వహించి పట్టాలు మంజూరు చేయాలని, గిరిజన ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పిస్తూ జి.సి.సి. ద్వారా కొనుగోలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే, మెట్టపాలెం నుండి పొర్లు వరకు బిటుమిన్ రహదారి నిర్మాణానికి అవసరమైన అటవీ అనుమతులు వెంటనే మంజూరు చేయాలన్నారు. దారపర్తి–కురిడి–పొర్లు–పల్లపుదుంగాడ వరకు లింక్ రోడ్ల నిర్మాణానికి ఇప్పటికే ఎస్టిమేట్ చేసినప్పటికీ, ప్రాజెక్ట్‌కు శాంక్షన్ రాబట్టే బాధ్యతను తీసుకుంటామని తెలిపారు. గిరిజనులను ‘డోలు మోత’ బారినుండి కాపాడే మార్గం ఇదే అని స్పష్టం చేశారు. స్వయం ఉపాధి నిమిత్తం మేకలు, పశువుల కొనుగోలు కోసం సబ్సిడీ లోన్లు మంజూరు చేయాలని, అలాగే బొడ్డవర–చిట్టంపాడు మధ్య రోడ్డు డిజైన్‌ను మారుస్తూ ప్రాజెక్టును పునరుద్దరించాలని సూచించారు. వబ్బిన సన్యాసి నాయుడు మాట్లాడుతూ, “కూటమి ప్రభుత్వం నేతృత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మార్గదర్శకతనుబట్టి సమస్యలన్నింటిని అధికారుల దృష్టికి తీసుకెళతాము. ఇప్పటికే అటవీ అనుమతుల కోసం మంత్రి సంధ్యారాణి గారి ద్వారా ఆదేశాలు అందజేశాము. రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కోసం కాంట్రాక్టర్లపై ఒత్తిడి తెస్తాము” అన్నారు. సమావేశంలో మాజీ సర్పంచ్ బుచన్న, వార్డు సభ్యుడు రాము తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment