అంబేద్కర్ కు నివాళులు అర్పించే అర్హత వైకాపా నాయకులకు లేదు: గురాన అయ్యలు

విజయనగరం, ప్రపంచ గొప్ప మేధావులలో ఒకరిగా, ప్రపంచానికే స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన అంబేడ్కర్ భారతీయునిగా జన్మించడం భారతీయులు చేసుకున్న అదృష్టమని జనసేన పార్టీ నాయకులు గురాన అయ్యలు పేర్కొన్నారు. డా.బి.ఆర్ అంబేద్కర్ 132 వ జయంతిని పురస్కరించుకుని అంబేద్కర్ కాలనీ, కలెక్టర్ ఆఫీస్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గురాన అయ్యలు మాట్లాడుతూ అంబేద్కర్ కు నివాళులు అర్పించే అర్హత వైకాపా ప్రజాప్రతినిధులకు, నాయకులకు లేదన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి దళితులపై దాడులు పెరిగాయని, వాటిని అరికట్టడంలో ముఖ్యమంత్రి జగన్ విఫలమయ్యారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా దళితవాడలలో మౌళిక వసతులు అయిన త్రాగునీరు, డ్రైనేజీ, సీసీ రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ద్వారా అభివృద్ధి చేయాల్సి ఉండగా నవరత్నాల పేరుతో ప్రభుత్వం వాడుకోవడం చాలా సిగ్గుచేటన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. దేశంలోని సంపద, విజ్ఞానం, సామాజిక న్యాయం, అందరికీ సమానంగా అందాలని అంబేడ్కర్ ప్రవచించిన ఆదేశిక సూత్రాలకు అనుగుణంగానే జనసేన పార్టీ ఆవిర్భవించిందన్నారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా రాజ్యాంగ ఫలాలు అందాలనే ఆయన ఆశయాలను జనసేన పార్టీ తరుపున ముందుకు తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ఆదాడ మోహన్ రావు, దంతులూరి రామచంద్రరాజు, రాజేంద్ర, వంక నరసింగరావు, త్యాడా రామకృష్ణ, ఎంటి రాజేష్, భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.