వాల్మీకి బోయల ఎస్టీ బిల్లు కూటమితోనే సాధ్యం

*డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల వాల్మీకుల ఎస్టి బిల్లు త్వరలో పాస్ అవుతుంది
*రాష్ట్ర ఐక్య వాల్మీకి బోయ పోరాట కమిటీ రాష్ట్ర అధ్యక్షులు, జనసేన ఇంచార్జ్ వాల్మీకి బి లక్ష్మన్న

వాల్మీకుల ఎస్టీ బిల్లు పాస్ చేయించడమే లక్ష్యంగా కర్నూలు బిర్లా కాంపౌండ్‌లో జరిగిన సమాఖ్య నాయకుల సమావేశం ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కుబేర్ స్వామితో పాటు ముఖ్యఅతిథులుగా డా. భవాని ప్రసాద్, ట్రస్ట్ చైర్మన్ బడన్న గారి రంగనాయకులు, రాష్ట్ర ఐక్య వాల్మీకి బోయ పోరాట కమిటీ అధ్యక్షులు మరియు మంత్రాలయం జనసేన ఇంచార్జ్ బి లక్ష్మన్న పాల్గొన్నారు.
సభలో రంగనాయకులు మాట్లాడుతూ అన్ని వాల్మీకి సంఘాలను ఒకజేఏసీగా ఏర్పరచుకొని సమగ్ర కార్యాచరణను చేపట్టాలన్నారు. డా. భవాని ప్రసాద్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లి కేంద్ర స్థాయిలో లాబీయింగ్ చేస్తానని హామీ ఇచ్చారు. లక్ష్మన్న మాట్లాడుతూ గత 40 ఏళ్లుగా కొనసాగుతున్న ఉద్యమ ఫలితంగానే వాల్మీకుల బిల్లు అసెంబ్లీలో ఆమోదమై కేంద్రానికి వెళ్ళిందని, కార్పొరేషన్, జయంతి జీవో, ఎమ్మెల్యే-ఎంపీ అవకాశాలన్నీ ఉద్యమాల సాక్ష్యంగా నిలిచాయని వివరించారు. ప్రస్తుతం కూడా ఉద్యమం తో పాటు లాబీయింగ్ ముమ్మరం చేస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలో లోకేష్, నాదెండ్ల మనోహర్, కొణిదల నాగబాబును కలిసినట్లు పేర్కొన్నారు. త్వరలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కలిసి వాల్మీకుల హక్కులపై చర్చిస్తామని చెప్పారు.
వాల్మీకుల ఎస్టీ బిల్లు పాస్ అయితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ గారులతో కలిసి విజయోత్సవ సభ నిర్వహిస్తామని లక్ష్మన్న ప్రకటించారు. ఉపాధ్యక్షుడు చిన్న ఈరన్న ఐక్యతకే ప్రాధాన్యం ఇచ్చి అందరూ కలసి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పెద్ద సంఖ్యలో వాల్మీకి సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Share this content:

Post Comment