జీల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సేవాకార్యక్రమాలు

శ్రీకాకుళం, తమ కడుపు నిండితే చాలనుకునే దోరణి కాకుండా పదిమంది కడుపునింపాలన్న దృక్పధంతో యువత ముందుకు వెళుతోంది. కుటుంబంలో వేడుకలను సైతం సేవా కార్యక్రమాలకు కేటాయిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. నగరానికి చెందిన పలు సంస్థలు సేవా కార్యక్రమాలు స్ఫూర్తినింపుతున్నాయి. అందులో ఒకటైన జీల్ ఫౌండేషన్ సభ్యుడు జాడ సాయి సేవామార్గంలో పయనిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. తన మాతృమూర్తి శ్రీదేవి జన్మదినాన్ని సైతం సేవాకార్యక్రమానికి మార్గం చేసుకున్నాడు. తమతో పాటు సమాజంలో కొంతమందికైనా కడుపునింపి సంతోషాన్ని పంచుకోవాలన్న లక్ష్యంతో జీల్ ఫౌండేషన్ సాయంతో సోమవారం పలు సేవాకార్యక్రమాలను చేపట్టాడు. ఇందులో భాగంగా స్థానిక బెహరా మనోవికాస కేంద్రంలో చిన్నారులకు అల్పాహారాన్ని తల్లి జాడ శ్రీదేవి, స్నేహితుల చేతుల మీదుగా అందజేసాడు. అదేవిధంగా మధ్యాహ్నం రిమ్స్ ఆసుపత్రిలో రోగుల సహాయకులకు భోజన వితరణ కార్యక్రమం చేపట్టి దాదాపు రెండు వందల మందికి డాడీ హెల్పింగ్ ఫౌండేషన్ సహకారంతో భోజన ప్యాకెట్లను పంపిణీ చేసారు. ఈ కార్యక్రమాల్లో సాయి స్నేహితులు యశ్వంత్, మనోజ్, అజయ్, శేఖర్, జీల్ ఫౌండేషన్ సత్యసాయి, శ్రీకాకుళం న్యూబ్లడ్ బ్యాంక్ మేనేజర్ మణికంఠ, శివ, జై శ్రీరాం, ఆంధ్రాబ్యాంకు సీనియర్ మేనేజర్ వెంకటరమణ, డాడీ హెల్ఫింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ప్రభాస్ సూర్య తదితరులు పాల్గొన్నారు.