నాన్‌వెజ్ టేస్ట్ తో వెజిటేరియన్ మీట్, ఫిష్

పోషకాహార లోపంతో బాధపడేవారు నాన్‌వెజ్ తినాలని వైద్యులు సూచిస్తుంటారు. అయితే కొందమంది శాఖాహారులు మాంసం, చేపలు, గుడ్లు తినేందుకు ఎంతమాత్రం ఇష్టపడరు. దీనివలన వారిలో పోషకాహార లేమి సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది. ఈ సమస్యను గుర్తించిన ఐఐటీ ఢిల్లీ… ప్లాంట్ బేస్డ్ మాంసం, చేపలను తయారు చేసింది. దీనిని శాఖాహారులు కూడా నిరభ్యంతరంగా తినొచ్చని ఐఐటీ ఢిల్లీ తెలిపింది.

ఈ మాంసాన్ని ఐఐటీ ఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ టెక్నాలజీ తయారు చేసింది. ఇక ఈ వెజిటేరియన్ మీట్ విషయానికొస్తే ఇది అచ్చం నాన్‌వెజ్ లాంటి రుచి, వాసనలు కలిగివుంటుంది. సుమారు రెండేళ్లుగా ఐఐటీ ఢిల్లీకి చెందిన ప్రొఫెసర్ కావ్యా దష్రా, అతని బృందం… ప్రోటీన్‌తో కూడిన పోషకాహార ఉత్పత్తులపై పరిశోధనలు సాగిస్తోంది. కాగా ప్రొఫెసర్ కావ్య యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం(యూఎన్డీపీ) తరపున మాక్ ఎగ్ ఇన్నోవేషన్‌కు గాను పురస్కారాన్ని అందుకున్నారు. ఈ నూతన ఉత్పత్తిని పరీక్షించేందుకు ఐక్యరాజ్యసమితి బృందం ఐఐటీ ఢిల్లీని విజిట్ చేయనుంది. ఈ సందర్శనలో ఈ వెజిటేరియన్ గుడ్డును ఉడికించి కూడా పరీక్షించనుంది.