వెటరన్ జర్నలిస్టులకు ఫించన్ కల్పించాలి!

*ఏపీ వీజేయూ డిమాండ్

వృధాప్యంలోకి అడుగుపెట్టిన వెటరన్ జర్నలిస్టులు ఆర్థికంగా, ఆరోగ్య పరంగా కష్టాలు ఎదుర్కొంటున్నారని, రాష్ట్ర ప్రభుత్వం వారికి గౌరవ ఫించన్ మంజూరు చేయాలని ఏపీ వెటరన్ జర్నలిస్ట్స్ యూనియన్ డిమాండ్ చేసింది. విజయవాడ ప్రెస్ క్లబ్‌లో యూనియన్ అధ్యక్షులు ఎం.వి. రామారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ సమావేశంలో ప్రముఖ సభ్యులు కె. వెంకటరత్నం, శిరందాసు నాగార్జున, ఎం.వి. రామారావు మాట్లాడుతూ, 16 రాష్ట్రాల్లో వెటరన్ జర్నలిస్టులకు ఫించన్ సదుపాయం ఉన్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం కనీస మద్దతు లేదని వాపోయారు. కరోనాతో ప్రాణాలు కోల్పోయిన యూనియన్ నాయకులు మణికుమార్, ఆదాయలేమితో చనిపోయిన అండా రామారావు ఉదాహరణగా చెప్పారు. వెటరన్ జర్నలిస్టులకు నెలకు ₹20,000 గౌరవ ఫించన్, ఉచిత ఆరోగ్య బీమా, వైద్య పరీక్షలు, ఆర్టీసీ బస్సుల్లో 1/3 చెల్లుబాటు అయ్యే పాస్, రాయలసీమ నుంచి వచ్చే జర్నలిస్టుల కోసం అమరావతిలో వసతిగృహం, ఇల్లులేని వారికి 50% సబ్సిడీతో ఇళ్లు మంజూరు చేయాలంటూ వారు ప్రభుత్వాన్ని కోరారు.
ఈ సమావేశంలో 100 మందికిపైగా వెటరన్ జర్నలిస్టులు పాల్గొన్నారు. కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. వినతి పత్రాన్ని ఉండవల్లి సీఎం నివాసం వద్ద సమర్పించారు. ఈ సమావేశంలో శివరామ రామాంజనేయులు, లింగ ప్రసాద్, ఆజాద్, జయరామిరెడ్డి, మాధవి, ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment