ఆమరణ నిరాహారదీక్షకు దిగిన వీహెచ్

రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కు తీరని అవమానం జరిగిందని టీకాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మండిపడ్డారు. గోషామహల్ పోలీస్ స్టేషన్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని తక్షణమే తమకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అంబేద్కర్ కోసం చావడానికైనా తాను సిద్ధమేనని చెప్పారు. ఈరోజు తన నివాసంలోనే వీహెచ్ నిరాహారదీక్షకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

పంజాగుట్టలో 2019 ఏప్రిల్ 12న అంబేద్కర్ విగ్రహాన్ని తాను ఆవిష్కరించానని… ఏప్రిల్ 13న విగ్రహాన్ని కూల్చేశారని వీహెచ్ ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడి నుంచి విగ్రహాన్ని గోషామహల్ పోలీస్ స్టేషన్ కు తరలించారని చెప్పారు. అప్పటి నుంచి ఆ విగ్రహం అక్కడే ఉందని… అంబేద్కర్ విగ్రహాన్ని పోలీస్ స్టేషన్ లో పెడతారా? అని మండిపడ్డారు. ఈ అంశం గురించి ప్రభుత్వంలో ఉన్న ఏ ఒక్కరూ మాట్లాడటం లేదని చెప్పారు. విగ్రహాన్ని తిరిగి ఇచ్చేంత వరకు తన నిరాహారదీక్ష కొనసాగుతుందని అన్నారు.

ఇదే సమయంలో షర్మిల పార్టీపై కూడా వీహెచ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజన్న రాజ్యం అని షర్మిల మాట్లాడుతున్నారని… కానీ, అది రాజన్న రాజ్యం కాదని, అది కాంగ్రెస్ రాజ్యమని అన్నారు.