దీక్ష విరమించిన వీహెచ్‌

హైదరాబాద్‌: పంజాగుట్టలో అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు చేయాలంటూ నిరవధిక దీక్షకు దిగిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు (వీహెచ్‌) దీక్ష విరమించారు. తన నివాసంలోనే ఆయన నాలుగు రోజులుగా దీక్ష కొనసాగించారు. ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని దీక్ష విరమించాల్సిందిగా తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మాణికం ఠాగూర్‌ వీహెచ్‌కు సూచించారు. దీంతో మాణికం ఠాగూర్‌ ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.

ఈ సందర్భంగా మాణికం మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఈ పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు విషయంలో సీఎం కేసీఆర్‌ వ్యవహరిస్తున్న తీరు సరిగాలేదని విమర్శించారు. 70 ఏళ్ల వయసులో వీహెచ్‌ నిరాహార దీక్షకు దిగారని.. కరోనా సమయంలో దీన్ని కొనసాగించడం సరికాదని భావించి ఆయనతో విరమింపజేశామన్నారు. వీహెచ్‌ వెంట కాంగ్రెస్‌ ఉంటుందని చెప్పారు.

విగ్రహం పెట్టకుంటే చరిత్ర హీనుడిగా మిగిలిపోతారు: వీహెచ్‌

వీహెచ్‌ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌కు అవమానం జరుగుతోందని ఆరోపించారు. రాజ్యాంగం ప్రకారమే తెలంగాణ వచ్చిందన్న విషయాన్ని కేసీఆర్‌ మరచిపోవద్దని హితవు పలికారు. పంజాగుట్టలో అంబేడ్కర్‌ విగ్రహం పెడితే పడగొట్టారని.. కొత్త విగ్రహం స్థాపిస్తే దాన్ని తీసుకెళ్లి గోషామహల్‌ స్టేషన్‌లో పెట్టారని ఆక్షేపించారు. తెలంగాణ కోసం బలిదానం చేసుకున్న కుటుంబాలను వైఎస్‌ షర్మిల పరామర్శించారా? అని వీహెచ్‌ ప్రశ్నించారు. ఆమె కూడా అంబేడ్కర్‌ విగ్రహంపై మాట్లాడాలని డిమాండ్‌ చేశారు. పంజాగుట్టలో విగ్రహం పెట్టకపోతే కేసీఆర్‌ చరిత్ర హీనుడిగా మిగిలిపోతారన్నారు.