కార్పొరేషన్ అవినీతిపై విజిలెన్స్ దర్యాప్తు చేపట్టాలి: ఆళ్ళ హరి

  • అవినీతి జరుగుతుందంటూ సాక్ష్యాత్తు డిప్యూటీ మేయరే చెబుతున్నారు.
  • అవినీతిపరుల చిట్టాను ప్రజల ముందుంచాలి.
  • కోట్ల అవినీతి జరుగుతుంటే 17 నెలలుగా మొద్దునిద్రపోతున్నారా?
  • వాటాల్లో తేడా రాగానే పారదర్శకత గుర్తుకు వచ్చిందా?
  • అధికారంలో ఉండి కూడా అవినీతి అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోవటం లేదు.
  • చిత్తశుద్ధి ఉంటే ప్రజాధనం దుర్వినియోగంపై రాతపూర్వకంగా కలెక్టర్ కి ఫిర్యాదు చేసేవాళ్ళు కార్పొరేషన్ లో జరిగిన ప్రతీ రూపాయి అవినీతిపై విజిలెన్స్ దర్యాప్తు చేపట్టాలి.
  • జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి డిమాండ్

కార్పొరేషన్ లో వ్యవస్థలన్ని అవినీతిమయంగా మారాయని, ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్ విభాగాల్లో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని యథేచ్ఛగా దోచుకుంటున్నారని సాక్షాత్తు డిప్యూటీ మేయర్ చెబుతున్నారని, కార్పొరేషన్ లో జరిగిన అవినీతిపై విజిలెన్స్ దర్యాప్తు చేపట్టాలని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి డిమాండ్ చేశారు. కార్పొరేషన్ లో కోట్ల రూపాయల అవినీతి జరుగుతుంది అంటూ డిప్యూటీ మేయర్ బాల వజ్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో ఆళ్ళ హరి మాట్లాడారు. టౌన్ ప్లానింగ్, ఇంజినీర్ విభాగాల్లో ఇంత పెద్దఎత్తున అవినీతి జరుగుతుంటే 17 నెలలుగా మొద్దునిద్రపోతున్నారా అని డిప్యూటీ మేయర్ని ప్రశ్నించారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే అవినీతిపై రాతపూర్వకంగా కలెక్టర్ కి ఫిర్యాదు చేసేవాళ్ళన్నారు. అధికారంలో ఉంది మీ పార్టీనే మేయర్ తో పాటు స్థానిక శాసనసభ్యులు సైతం మీ పార్టీకి చెందిన వారే అయినా అవినీతి అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోవటం లేదో చెప్పాలన్నారు. అయింది ఏదో అయిపోయింది ఇక నుంచి పారదర్శకంగా ఉంటామంటూ వ్యాఖ్యానించటం బాధ్యతారాహిత్యమని విమర్శించారు. ఇన్నాళ్లూ పారదర్శకంగా బాధ్యతలు నిర్వర్తించలేదా అని ధ్వజమెత్తారు. వాటాల్లో తేడా రాగానే పారదర్శకత గుర్తుకువచ్చిందా అని దుయ్యబట్టారు. రాష్ట్ర రాజధాని ప్రాంతమైన గుంటూరు నగరంలో కౌన్సిల్ ఏర్పడ్డాక జరిగిన అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. టాక్స్ ల రూపంలో కోట్ల రూపాయలు ప్రజల నుంచి వసూలు చేయడంలో ఉన్న శ్రద్ధ నగరాన్ని అభివృద్ధి చేయటంలో మాత్రం లేదన్నారు. గుంతలమయంగా మారిన రోడ్లపై ఒక తట్ట మట్టి వేశారా, ఒక్క సీసీ రోడ్డు అన్నా వేశారా అని ప్రశ్నించారు. వంద కోట్లతో ప్రారంభించిన అండర్ డ్రైనేజీ పనులు ఎక్కడివక్కడే ఆగిపోయాయి కనీసం వాటిపై ఒక్కసారన్నా రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసారా అన్నారు. గుంటూరు నగరంలో ఒక్క పదినిముషాలు వర్షం పడితే చాలు మోకాళ్ళ లోతు నీళ్లు రోడ్లపైనే నిలుస్తాయని సాక్షాత్తు నగరపాలక సంస్థ ముందే ఈ దుస్థితి నెలకొన్నా సమస్యని పరిష్కరించే దిశలో చర్యలు చేపట్టలేని అసమర్ధ స్థితిలో కౌన్సిల్ ఉందని విమర్శించారు. ఒకవైపు కార్పొరేటర్ల దందాతో ప్రజలు అల్లాడుతున్నారని, మరోవైపు అధికారుల అవినీతితో నగర ప్రజల జీవితాలు చిన్నాభిన్నం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేషన్ లో బలం ఉందని ఏదిచేసినా అడిగేవాళ్ళు వాళ్ళు లేరని విర్రవీగితే ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు. కార్పొరేషన్ లో జరిగినట్లు చెబుతున్న ప్రతీ రూపాయి అవినీతిపై నిగ్గుతేల్చి అవినీతికి పాల్పడ్డ అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయమై త్వరలోనే సంభందిత మంత్రిని, కలెక్టర్ ని, విజిలెన్స్ డిపార్ట్మెంట్ వారిని కలుస్తామని ఆళ్ళ హరి తెలిపారు. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసినా, దోచుకుంటూ ఉన్నా జనసేన చూస్తూ ఊరుకోదని, కార్పొరేషన్ లో అవినీతిని అరికట్టకపోతే ప్రజలని కలుపుకొని కార్పొరేషన్ ని ముట్టడిస్తామని ఆళ్ళ హరి హెచ్చరించారు. సమావేశంలో నగర కార్యదర్శి అందే వెంకటేశ్వర్లు, మైనారిటీ నాయకులు షేక్ షర్ఫుద్దీన్, మహంకాళి శ్రీనివాస్, తేజ తదితరులు పాల్గొన్నారు.