‘లైగర్’ అంతకు మించి ఉంటుందన్న విజయ్ దేవరకొండ!

విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ రూపొందుతోంది. విజయ్ దేవరకొండకి యూత్ లోను .. మాస్ ఆడియన్స్ లోను విపరీతమైన క్రేజ్ ఉంది. ఇక మాస్ పల్స్ తెలిసిన పూరి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. అందువలన ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న ‘లైగర్’ పై భారీ అంచనాలు ఉన్నాయి. కరోనా కారణంగానే ఈ సినిమా షూటింగు విషయంలో జాప్యం జరిగింది. ఇప్పుడు ఆ కరోనా ఎఫెక్ట్ కారణంగానే ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయనున్నారనే ఒక టాక్ బయటికి వచ్చింది.

‘లైగర్’ను అన్ని భాషల్లోను నేరుగా ఓటీటీ రిలీజ్ కి ఇవ్వమంటూ 200 కోట్ల రూపాయల ఆఫర్ వచ్చిందనే టాక్ జోరుగా షికారు చేస్తోంది. ఈ ప్రచారంపై తాజాగా విజయ్ దేవరకొండ స్పందించాడు. “ఇది చాలా తక్కువ .. ఇంతకు మించి థియేటర్లలో చూపిస్తాను” అని చెప్పాడు. అంటే ‘లైగర్’కి 200 కోట్ల రూపాయల ఆఫర్ చాలా చిన్నదనీ, థియేటర్స్ లో ఈ సినిమా ఇంతకు మించిన వసూళ్లను రాబడుతుందనే విషయాన్ని ఆయన స్పష్టం చేశాడు. ఈ సినిమా థియేటర్లలో మాత్రమే విడుదలవుతుందని చెప్పకనే చెప్పాడు. ఈ సినిమా ద్వారా కథానాయికగా ‘అనన్య పాండే’ పరిచయమవుతున్న సంగతి తెలిసిందే.