విజయసాయికి సీబీఐ కోర్టులో ఊరట.. విదేశాలు వెళ్లేందుకు అనుమతి

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసులో సహ నిందితుడైన ఎంపీ విజయసాయిరెడ్డికి సీబీఐ కోర్టులో నిన్న ఊరట లభించింది. అక్టోబరులోగా రెండు వారాలపాటు దుబాయ్, మాల్దీవులు, బాలి వెళ్లేందుకు అనుమతించాలంటూ విజయసాయిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై నిన్న వాదనలు జరిగాయి.

తీరప్రాంతమైన విశాఖపట్టణాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడంలో భాగంగా తీర ప్రాంత దేశాలైన దుబాయ్, మాల్దీవులు, బాలిలో అధ్యయనం చేయడానికి ఎంపీ హోదాలో పర్యటించేందుకు అనుమతివ్వాలని విజయసాయి ఆ పిటిషన్‌లో కోరారు. దీనిని విచారించిన సీబీఐ ప్రధాన కోర్టు న్యాయమూర్తి బీఆర్ మధుసూదన్‌రావు వాదనల అనంతరం విజయసాయి విదేశీ పర్యటనకు అనుమతినిస్తూ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే, పర్యటనకు ముందు రూ. 5 లక్షల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని పేర్కొంటూ షరతులతో కూడిన అనుమతినిచ్చారు.