ఆ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలి.. కేసిఆర్

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లు రైతులకు అన్యాయం చేసే విధంగా ఉందని సీఎం కేసిఆర్ అన్నారు. రైతులను దెబ్బతీసి కార్పోరేటు వ్యాపారులకు లాభం చేకూర్చే విధంగా ఉన్న ఈ బిల్లును గట్టిగా వ్యతిరేకించాలని టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె.కెశవరావును ఆదేశించారు.

కేంద్ర వ్యవసాయ బిల్లును సీఎం కేసీఆర్ తీవ్రంగా తప్పుపట్టారు. కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లుతో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు. వ్యవసాయ బిల్లు అమలులోకి వస్తే రైతుల పరిస్థితి దారుణంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. రవాణా ఖర్చులు భరించి రైతులు వేరే చోట అమ్ముకోవడం సాధ్యమా? కేంద్ర వ్యవసాయ బిల్లు తేనె పూసిన కత్తి లాంటిది అని ధ్వజమెత్తారు. మక్కల దిగుమతి సుంకాన్ని ఎవరికోసం తగ్గించారు? ఆర్థిక సంక్షోభం సమయంలో ఇలాంటి నిర్ణయమా? సుంకం తగ్గించి మక్కలు దిగుమతి చేసుకుంటే రైతులు ఏమైపోవాలని కేసీఆర్ ప్రశ్నించారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని టిఆర్ఎస్ ఎంపీలను ఆదేశించారు.