చిరు ఉద్యోగులైన వి.ఆర్.ఏ.లపై చిన్న చూపు తగదు!

  • పెరిగిన ధరలకు కనీస జీతం రూ. 26,000లు ఇవ్వాలి
  • వీఆర్ఏల నిరసన దీక్షకు సంఘీభావం తెలిపిన జనసేన పార్టీ నాయకులు

పార్వతీపురం: చిరు ఉద్యోగులైన విఆర్ఏలపై చిన్న చూపు తగదని జనసేన పార్టీ నాయకులు వంగల దాలి నాయుడు అన్నారు. గత 36 గంటలుగా పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో గ్రామ సేవ సహాయకులు (వి ఆర్ ఏ)లు చేస్తున్న నిరసన దీక్షకు జనసేన పార్టీ నాయకులు తమ సంఘీభావాన్ని తెలిపారు. మంగళవారం జనసేన పార్టీ నాయకులు వంగల దాలి నాయుడు, అన్నాబత్తుల దుర్గాప్రసాద్ లు వీఆర్ఏల నిరసన దీక్ష టెంట్ వద్దకు వెళ్లి జనసేన పార్టీ తరపున తమ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయా శాఖలకు చెందిన చిరు ఉద్యోగులపై తమ ప్రతాపం చూపుతోందన్నారు. వీఆర్ఏలు, పారిశుద్ధ్య కార్మికులు ఇటువంటి చిరు ఉద్యోగులపై దయాదాక్షిణ్యం చూపకుండా వారిని వేదిస్తోందన్నారు. తక్షణమే వారి సమస్యలను పరిష్కరించాలన్నారు. దీనిలో భాగంగా కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలన్నారు. పే స్కేల్ అమలు చేయాలన్నారు. నామినీలను వీఆర్ఏలుగా గుర్తించాలన్నారు. అర్హత ఉన్న వీఆర్ఏలకు అటెండర్, వాచ్ మెన్, కంప్యూటర్ ఆపరేటర్లుగా పదోన్నతులు కల్పించాలన్నారు. డి.ఏ రికవరీ జీవోను వెనక్కి తీసుకొని, డి.ఏతో కూడిన వేతనం ఇవ్వాలన్నారు. 65 సంవత్సరాలు దాటిన వీఆర్ఏలకు వారసత్వం కల్పించాలన్నారు. వీఆర్ఏలు తమ హక్కుల కోసం చేస్తున్న పోరాటానికి జనసేన మద్దతు ఉంటుందన్నారు. ప్రస్తుతం పెరిగిన నిత్యవసరాల ధరలకు కనీస వేతనం ఇవ్వకపోతే కుటుంబాలు ఆకలితో అలమటిస్తాయి అన్న విషయం పాలకులు అధికారులు తెలుసుకొని రెవిన్యూ శాఖలో చిరు ఉద్యోగులైన కీలకమైన వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గ్రామస్థాయిలో రెవెన్యూ కార్యాలయాల వద్ద ఊడిగం చేస్తున్న వీఆర్ఏలపై చిన్నచూపు తగ్గదని హితవు పలికారు.