నిద్రనుంచి లేవండి.. గుంతల రోడ్డు చూడండి: కురుపాం జనసేన

*అప్పులు చేసి నవరత్నాలు పంచడం కాదు రోడ్లు వేయండి
*గుంతల వద్ద వరినాట్లు నాటుతు నిరసన
*రోడ్డు సెస్ రూ.750కోట్లు ఎక్కడని ప్రశ్నించిన జనసైనికులు
*రోడ్లల కోసం తెచ్చిన అప్పు ఎటు మళ్లించారు…???

కురుపాం: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు రాష్ట్రంలో రోడ్లు అద్వానస్థితిపై గుడ్ మార్నింగ్ సీఎం సర్ కార్యక్రమం గుమ్మలక్ష్మీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ కి వెళ్లే రహదారిపై మరియు కురుపాం మండలం, లేవిడి నుంచి నీలకంఠాపురం వెళ్లే రహదారి వద్ద కురుపాం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు ఇరిడి ఎంపీటీసీ కడ్రక. మల్లేశ్వరావు ఆధ్వర్యంలో వరినాట్లు వేస్తూ నిద్రలో కలలు కనడం ఆపేసి మత్తు నిద్రనుంచి లేవండి గుంతల రోడ్డు చూడండని నినదిస్తూ గుడ్ మార్నింగ్ సి.ఎం.సార్ అనే ఫ్ల కార్డులు పట్టుకొని నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొద్దు నిద్ర వీడాలని, రాష్ట్రంలోని రోడ్ల దుస్థితిని చూడాలని నియోజకవర్గంలో పలుచోట్ల రోడ్లు పెద్దపెద్ద గోతులు పడి వాహన సోధకులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారని, రోడ్లు ప్రమాదాలకు నిలయంగా మారాయని రాష్ట్రంలో రహదారులు కనీస మరమ్మతులు కూడా కాలేదని గాఢ నిద్రలో ఉన్న ముఖ్యమంత్రిని నిద్ర లేపేందుకే ఈ కార్యక్రమమని రోడ్డు మరమ్మత్తుల కోసం అని చెప్పి ఎక్కువ వడ్డీలకు నిధులు తెచ్చి ఆ సొమ్ములు ఏమి చేశారని పెట్రోల్ మీద ఏటా సామాన్యుడి నుంచి రూ. 750 కోట్లు రోడ్ సెస్ వసూలు చేస్తున్నారని, వాటిని ఏమి చేశారని ప్రశ్నించారు. ఆ సెస్ చూపి రూ. 6 వేల కోట్లు అప్పులు తెచ్చారని ఆరోపించారు. ముఖ్యమంత్రికి జవాబుదారీతనం ఉంటే ఆ నిధులు ఎందుకు ఖర్చు చేశారో వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వ వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలను జనసేన పార్టీ తిప్పికొడుతుందన్నారు. అనంతరం డుమ్మంగి సర్పంచ్ క్రాంతి మాట్లాడుతూ జూలై 15వ తేదీ లోపల రాష్ట్రంలో ఏ గొయ్యి ఉండకూడదు అని ప్రగల్భాలు పలకడం తప్ప రాష్ట్రంలో ఒక్క రోడ్డు కూడా ఒక్క గొయ్యి కానీ పూడ్చలేదని ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వం అభివృద్ధి చేయడంలో పూర్తిగా విఫలం అయ్యిందని అలాగే ఒక మాజీ మంత్రి అధికార పార్టీ జిల్లా అధ్యక్షులు ఉన్న నియోజకవర్గంలో కనీసం రోడ్డు మరమ్మత్తులు, గోతులు కూడా పూడ్చలేని దయనీయ స్థితిలో వున్నరని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో అరుకు పార్లమెంట్ కార్యదర్శి కొణిశ. రాజా, అధికారి అనిల్, వార్డ్ మెంబెర్ శ్రీహరి జనసైనికులు పాల్గొన్నారు.