అధికారులు.. పాలకుల చుట్టూ తిరిగి అలసిపోయాం

• మా భూములు తీసుకుని వారి అనుచరులకు పరిహారం ఇచ్చుకున్నారు
• జీవనాధారం కోల్పోయి వలసలు వెళ్లి బతుకుతున్నాం
• మొక్కలు ఉన్న భూములకే పరిహారం అంటున్నారు.. మొక్కల మీద బిల్డింగులు కడతారా?
• భూములు ఇచ్చి పోలీసులతో కొట్టించుకున్నాం.. అధికారులతో తిట్టించుకున్నాం
• జగన్ దయవల్ల జైలు జీవితం చూశాం
• మాకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదు
• శ్రీ పవన్ కళ్యాణ్ తో మల్లవల్లి పారిశ్రామిక వాడ నిర్వాసిత రైతులు
మల్లవల్లి పారిశ్రామికవాడ పేరిట పరిశ్రమలు పెడతామంటూ గత ప్రభుత్వ హయాంలో భూములు తీసుకున్నారు.. తరతరాలుగా మాకు వస్తున్న భూములు త్యాగం చేశాం.. అప్పటి నుంచి పరిహారం ఇవ్వలేదు.. ఉన్న జీవనాధారం పోయి వలసలు వెళ్లి బతుకుతున్నాం. అధికారులు, పాలకుల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగి అలసిపోయాం. న్యాయం చేస్తామని చెప్పే వాళ్లే గాని మాకు న్యాయం చేసిన వారు లేరు. ఇక్కడ పనులు చేయాలంటే మాకు పరిహారం ఇచ్చి తీరాలని పోరాడుతున్నాం.. మాకు న్యాయంగా రావాల్సిన పరిహారం కోసం పోరాడుతుంటే మాపై పోలీసులతో దాడులు చేయిస్తున్నారు. పొలంలో మొక్కలు వేసిన వారికే పరిహారం అంటున్నారు.. కొందిరికి ఇచ్చేస్తామంటారు గాని ఇవ్వరు.. పెళ్లిళ్ల సమయంలో ఆడ బిడ్డలకు స్త్రీ ధనం కింద ఇచ్చిన భూములు కూడా లాక్కున్నారు. మా బిడ్డల సంసారాలు పోయాయి.. కృష్ణా జిల్లా, బావులపాడు మండలం, మల్లవల్లి పారిశ్రామికవాడ నిర్వాసిత రైతుల గోడు ఇది. ఆదివారం మధ్యాహ్నం రైతులతో ముఖాముఖి చర్చించి, వారి తరఫున గళం విప్పేందుకు మల్లవల్లికి వచ్చిన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఎదుట తమ బాధలు చెప్పుకున్నారు. తమకు న్యాయంగా అందాల్సిన పరిహారం అందేలా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారిని వేడుకున్నారు. వారి దీన గాధలు విని చలించిపోయిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు చివరి ఎకరానికీ పరిహారం అందే వరకు రైతులకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. జనసేన అధ్యక్షుల ఎదుట రైతులు ఏం చెప్పుకున్నారంటే..
• అధికారుల చుట్టూ వందలసార్లు తిరిగి అలసిపోయాం: శ్రీ దోనవల్లి వెంకట్రావు, రైతు, మర్రిబంధం
2016లో పారిశ్రామిక వాడ పేరిట మా భూములు తీసుకున్నారు. అందులో నా చెల్లికి స్త్రీ ధనం కింద ఇచ్చిన రెండెకరాల భూమి కూడా ఉంది. పంట వేశాం.. ఫలాలు నోటికి అందే సమయానికి ప్రభుత్వం తీసేసుకుంది. పరిహారం విషయంలో అప్పటి ప్రభుత్వం గాని, ఇప్పటి ప్రభుత్వం గాని మాకు న్యాయం చేయలేదు. పాలకులు, రెవెన్యూ అధికారుల చుట్టూ వందల సార్లు తిరిగి అలసిపోయాం. 124 మంది రైతులదీ అదే పరిస్థితి. చివరికి ఇక్కడే ఒక టెంటు వేసుకుని ఉద్యమానికి దిగాం. ఏపీఐఐసీ అధికారులు మా మీద జులం చూపి లారీలతో ఇసుక, కంకర తోలే ప్రయత్నం చేస్తే అడ్డుకున్నాం. మా భూములకు మాకు పరిహారం అయినా రావాలి.. భూమి అయినా రావాలన్న పట్టుదలతో ముందుకు వెళ్తున్నాం. రహదారులు నిర్భంధించాం. అధికారులు వచ్చి పది రోజుల్లో సమస్య పరిష్కరిస్తామన్నారు. ఇప్పటికి 40 రోజులు గడచినా సమాధానం లేదు. భూములు ఇచ్చిన మమ్మల్ని పొరుగూరు రైతులు.. ఫేక్ రైతులు అంటున్నారు.
* మాటిచ్చి.. మాకోసం వచ్చారు : శ్రీమతి పోలవరపు నాగమణి, పొలసానిపల్లి
ఈ ప్రాంతంలో మా కుటుంబానికి 8 ఎకరాల భూమి ఉంది. అందరికీ పరిహారం ఇచ్చారు. మాకు ఎందుకు ఇవ్వలేదని అడిగితే.. మీ పొలంలో మొక్కలు లేవన్నారు. పైరు వేసి ఫోటోలు దిగి రమ్మన్నారు. ఆ భూమి మాది అనడానికి మా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి. శిస్తు కట్టిన రసీదులు ఉన్నాయి. నవాబులు ఇచ్చిన పట్టాలు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే శ్రీ వంశీ వారం రోజుల్లో శ్రీ చంద్రబాబు నాయుడు గారిని కలుస్తాం. పరిహారం ఇప్పించేస్తామన్నారు. టీడీపీ ప్రభుత్వం పోయి వైసీపీ వచ్చింది.. అప్పటి నుంచి ఇప్పటి వరకు తిప్పుతూనే ఉన్నారు. ఎంత మంది దగ్గరకు వెళ్లినా పని కావడం లేదు. ఉద్యమించగా పది రోజుల్లో డబ్బు ఇప్పిస్తామన్నారు. 40 రోజులు అయ్యింది. పరిహారం ఇచ్చే దిక్కు లేదు. మేము రోడ్ల మీదకెక్కితే పోలీసులు ఆగం చేస్తున్నారు.
మా కోసం మీరున్నారన్న ధైర్యంతో బతుకుతాం :శ్రీ వీసం మురళీకృష్ణ, పెదపూడి
పొలాల్లో వేసిన మొక్కల్ని సొంత బిడ్డల మాదిరి సాకి పెంచుకున్నాం. ఫలసాయం చేతికి వచ్చే సమయానికి రాష్ట్ర విభజన జరిగి పరిశ్రమలు పెడతామంటూ మా పొలాలు తీసుకున్నారు. ఇప్పుడు పరిహారం ఇవ్వకుండా మా మీద దౌర్జన్యం చేసి మమ్మల్ని జైలుకి పంపారు. మేము సామాన్య రైతులం. మాకు ఉద్యమాలు ఎలా చేయాలో కూడా తెలియదు. అలాంటిది మా మీద కేసులు పెట్టారు. మా బాధలు ఏ అధికారికి పట్టవు. మీ మద్దతుతో మాకు ధైర్యం వచ్చింది. మమ్మల్ని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా భయపడం. మాకోసం శ్రీ పవన్ కళ్యాణ్ గారు వచ్చారన్న ధైర్యంతో బతుకుతాం అన్నారు.
ఆడవారి మీద కూడా కేసులు పెడుతున్నారు : శ్రీమతి గోగినేని శకుంతల, గొల్లపల్లి
2016 నుంచి ఉద్యమం చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఐదేళ్ల క్రితం మావారికి షుగరు వచ్చి కాలు తీసేశారు. మాకున్నది ఎకరంన్నర భూమి. పరిహారం ఇవ్వలేదు. మా ఎమ్మెల్యే మాత్రం అక్కమ్మ.. చెల్లెమ్మ అంటూ కబుర్లు చెప్పి నమ్మించి మోసం చేస్తున్నారు. మా డబ్బు ఆయన వాడుకుని మాకు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. మాట్లాడితే ఆడవారు అని కూడా చూడకుండా కేసులు పెట్టిస్తున్నారు. వాళ్ల సొమ్ము మేము తిన్నామా?
• పరిహారం చెల్లించకుండా భూములు ఏపీఐఐసీకి ఎలా చెందుతాయి?
పెదపూడి, పొలసానిపల్లి, గొల్లపల్లి గ్రామాలకు చెందిన రైతులు శ్రీ వి.రామకృష్ణ, శ్రీ ముక్కు శ్రీరామ్మూర్తి, శ్రీమతి దోనేపూడి తంగిడమ్మ, శ్రీ సీహెచ్ ప్రసాద్ తదితరులు మాట్లాడుతూ.. “మొక్కలు వేసిన భూములకే పరిహారం అంటున్నారు. మొక్కల మీద భవనాలు కడతారా? మల్లవల్లి పారిశ్రామికవాడ బాధితులకు న్యాయం చేసేందుకు ప్రత్యేక కమిషన్ వేసేలా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒత్తిడి తీసుకురావాలి. మాకు డబ్బులు ఇవ్వకుండా ఈ భూములు ఏపీఐఐసీ వాళ్లవి ఎలా అవుతాయి? అదేమంటే మీ ఓట్లు మాకు పడవు అంటున్నారు? ఓట్లు వేస్తేనే న్యాయం చేస్తారా? మా పొలంపై బ్యాంకు లోను కూడా ఇచ్చింది. 145 రోజులుగా రోడ్ల మీదే వంటావార్పు చేసుకుని న్యాయం కోసం పోరాడుతున్నాం. అధికారుల చుట్టూ తిరిగితే హేళన చేస్తున్నారు. ఎకరాకి మాకు ఏడున్నర లక్షల పరిహారం ఇస్తానన్న విషయం వాస్తవం కాదా? మా భూములు ఇచ్చి పోలీసులతో కొట్టించుకున్నాం. రెవెన్యూ అధికారులతో తిట్టించుకున్నాం. జగన్ పుణ్యమా అని జైలు జీవితం కూడా చూశాం. మా భూములు తీసుకుని వారి అనుచరులకు పరిహారం ఇచ్చుకున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు మా దగ్గరకు రావడం మాకు కొండంత బలాన్నిచ్చింది. మాకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపబోమ”ని చెప్పారు.
• శ్రీ పవన్ కళ్యాణ్ కి ఘన స్వాగతం
మల్లవల్లి పారిశ్రామికవాడ నిర్వాసిత రైతులకు అండగా మల్లవల్లి బయలుదేరిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఉమ్మడి కృష్ణా జిల్లా పార్టీ శ్రేణులు, రైతులు, వీర మహిళలు అడుగడుగునా హారతుల స్వాగతం పలికారు. రామరవప్పాడులో ముస్లిం సోదరులు రోడ్డు మీదకు వచ్చి ఆహ్వానం పలికారు. పేరంటాళ్ల అమ్మవారి ఆలయం వద్ద ఆడపడుచులు హారతులు పట్టారు. తన కోసం వచ్చిన ప్రతి ఒక్కరికీ వాహనం పై నుంచి అభివాదం చేస్తూ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముందుకు కదిలారు. కేసరపల్లి, గన్నవరం, హనుమాన్ జంక్షన్లలో జనసైనికులు, వీర మహిళలు పూల వర్షం కురిపించారు. జంక్షన్ నుంచి మల్లవల్లి వరకు పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా వేలాదిగా జనసేన శ్రేణులు మల్లవల్లికి వచ్చారు.