ధరల బరువు తగ్గించాలి..!

  • వై.సి.పి.పాలనలో నిత్యావసర ధరలకు రెక్కలు
  • పెరిగిన ధరలతో సామాన్యుడు విలవిల
  • టమాట, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, పప్పులు సబ్సిడీ ధరలకు ప్రభుత్వం అమ్మకాలు చేయాలి
  • జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేసిన జనసేన పార్టీ నాయకులు

పార్వతీపురం: అమాంతం పెరిగిన నిత్యావసర సరుకుల ధరలతోపాటు టమాట, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ధరలు తగ్గించేందుకు తగు చర్యలు చేపట్టాలని జనసేన పార్టీ నాయకులు కోరారు. శుక్రవారం జనసేన పార్టీ జిల్లా నాయకులు వంగల దాలి నాయుడు, అన్నాబత్తుల దుర్గాప్రసాద్, కర్రి మణి, కొల్లి వెంకటరావు, ఎస్. సంతు, కె. నాని తదితరులు పెరిగిన నిత్యావసర సరుకులు ధరలు తగ్గించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ పాలనలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలతో పాటు నిత్యవసర సరుకులు ధరలు పెరిగి సామాన్యుడిని భయపెడుతున్నాయన్నారు. వాటితోపాటు గత కొద్ది రోజులుగా టమాట, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఎండుమిర్చి తదితర వాటి ధరలు పెరిగి సామాన్యుడు బ్రతకలేని విధంగా ఆర్థిక అవస్థలకు గురి చేస్తున్నాయన్నారు. తక్షణమే ధరల నియంత్రణకు చర్యలు చేపట్టాలని కోరారు. ధరల దరువుకు, సామాన్యుడు బతుకు బరువై విలవిలలాడుతుంటే సంబంధిత పాలకుల్లో, అధికారుల్లో చలనం లేదన్నారు. ప్రస్తుతం కందిపప్పు కిలో 150 రూపాయలు పలుకుతుందన్నారు. అలాగే పెసరపప్పు కూడా కిలో 110 రూపాయలు, ఇలా శెనగ, ఉలవ పప్పులు, శెనగ గుడ్లు తదితర నిత్యవసరాల ధరలు పెరిగి ప్రజలను ఆర్థిక ఇబ్బందులు గురిచేస్తున్నాయన్నారు. వీటికి తోడుగా ఇప్పుడు అల్లం కిలో 250 రూపాయలు, పచ్చిమిర్చి కిలో 150 రూపాయలు, వెల్లుల్లి కిలో 140 రూపాయలు, టమాటో కిలో 140 రూపాయలు, ఎండుమిర్చి కిలో 400 రూపాయలు ధరలు పెరిగి ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయన్నారు. తక్షణమే సంబంధిత అధికారులు పాలకులు స్పందించి ధరలు నియంత్రణకు చర్యలు చేపట్టాలన్నారు. అలాగే ధరలు పెరిగిన సరుకులను సబ్సిడీ ధరలకు రైతు బజార్లో ప్రభుత్వమే అమ్మకాలు చేయాలని కోరారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ కార్యాలయంలో సిసి గెంబలి నవీన్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బలిజిపేట మండలానికి చెందిన జనసైనికులు పాల్గొన్నారు.