కేసులు పెరిగితే చర్యలేంటి?.. ప్రశ్నించిన ఏపీ హైకోర్టు

రానున్న రోజుల్లో కరోనా కేసులు పెరిగితే ఎలాంటి చర్యలు తీసుకుంటారని.. ఆక్సిజన్‌ అందక రోగులు చనిపోతే పరిస్థితేంటని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. రాష్ట్రంలో కొవిడ్ చికిత్సపై సామాజిక కార్యకర్త తోట సురేష్ బాబు, సివిల్ లిబర్టీస్ దాఖలు చేసిన పిటిషన్లపై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఆక్సిజన్, పడకలు, ఔషధాలు, కొవిడ్ పరీక్షల ఫలితాలు, వ్యాక్సినేషన్‌ వంటి కీలకాంశాలపై గంటన్నరకు పైగా విచారణ జరిపింది. అమికస్ క్యూరీగా సీనియర్ న్యాయవాది వైవీ రవిప్రసాద్‌ను హైకోర్టు నియమించింది. మరణించిన వారికి గౌరవప్రదంగా దహన సంస్కారాలు నిర్వహించాలని ప్రభుత్వానికి సూచించింది. కొవిడ్ చికిత్సపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి వివరాలను గురువారంలోపు సమర్పించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.