ఏమి సాధించారని సమ్మె విరమింపచేశారు?

  • జేఏసీ నాయకుల్ని ప్రశ్నించిన జనసేన నాయకులు.

గుంటూరు, కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం ఏమి నెరవేర్చిందని ఉధృతంగా కొనసాగుతున్న సమ్మెను విరమింపచేసారని కార్మిక సంఘాల రాష్ట్ర జేఏసీ నాయకులను జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి, రెల్లి యువజన సంఘ నాయకులు సోమి ఉదయ్ ప్రశ్నించారు. ప్రధాన డిమాండ్లైన సమాన పనికి సమాన వేతనం , ఉద్యోగ భద్రత విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ లభించిందో స్పష్టం చేయాలన్నారు. గతంలో ఉన్న 21 వేయి జీతాన్నే ఇప్పుడూ ఇస్తామంటున్నారని ఆ మాత్రానికే ఉద్యమాన్ని ఎందుకు నీరుగార్చారో జేఏసీ నాయకులు కార్మికులకు చెప్పాలన్నారు. కార్మికుల సమ్మెకు ప్రజల నుంచి పూర్తిస్థాయిలో మద్దతు లభిస్తుందన్న సమయంలో, కార్మికుల డిమాండ్లను నెరవేర్చాలంటూ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి నెలకొన్న సందర్భంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ లభించకుండా పెద్దఎత్తున జరుగుతున్న సమ్మెకి విరామం ఎందుకు ప్రకటించాల్సి వచ్చిందని ప్రశ్నించారు. కార్మికుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని, వారి శ్రమని దోపిడీ చేసే అధికారం మంత్రులకు, ఉద్యమ నాయకులకు లేదన్నారు. కార్మికుల పక్షాన పోరాడేందుకు జనసేన ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటుందని ఆళ్ళ హరి అన్నారు.