ఏపీలో నూత‌న మంత్రివర్గం దేనికోసం? : డా.వంపూరు గంగుల‌య్య‌

పాడేరు, ఆంధ్ర‌ప్ర‌దేశ్ కేబినేట్‌లో నూత‌న మంత్రులుగా ప్ర‌మాణ‌స్వీకారం చేసినవారు మాట్లాడిన మాట‌లు వింటుంటే.. దేనికోసం ఈ మంత్రివ‌ర్గం ఏర్పాటు చేశార‌ని జ‌న‌సేన అర‌కు పార్ల‌మెంట్ ఇన్‌చార్జ్ డాక్ట‌ర్ వంపూరు గంగుల‌య్య ప్ర‌శ్నించారు. ఎవ‌రైనా మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించేట‌ప్పుడు ప్ర‌జా సంక్షేమానికి కృషి చేస్తామ‌ని, రాష్ట్ర అభివృద్ధికి పాటుప‌డ‌తామ‌ని చెప్తారు. కానీ నిన్న జ‌రిగిన ప్ర‌మాణ‌స్వీకారంలో ఏ ఒక్క మంత్రి ఆ మాట అన‌క‌పోవ‌డం శోచ‌నీయ‌మ‌ని తెలిపారు. 2024 లో వైకాపాను మ‌ళ్లీ అధికారంలోకి తీసుకొస్తామ‌ని జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డిని మ‌ళ్ళీ ముఖ్య‌మంత్రిని చేయ‌డానికి కృషి చేస్తామ‌ని చెప్ప‌డాన్ని రాష్ట్రప్ర‌జ‌లంతా హేళ‌న చేస్తున్నార‌ని.. ఆయ‌న విమ‌ర్శించారు. రాజ్యాంగ‌బ‌ద్ధ‌ స‌భగా భావించే ప్ర‌మాణ‌స్వీకార కార్య‌క్ర‌మంలో ఈ మాదిరిగా వ్య‌వ‌హ‌రించ‌డం దేశ చ‌రిత్ర‌లో ఇదే తొలిసారి అని ఆయ‌న పేర్కొన్నారు. అంటే మంత్రులంతా ఇలాంటి మాట‌లు చెప్ప‌డానికే త‌ప్ప శాస‌నాలు చేసే అధికారం ఇవ్వ‌బోర‌ని ఈ స‌భ ద్వారానే సంకేత‌మిచ్చార‌ని అన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర చ‌రిత్ర‌లో మంత్రులంతా కీలు బొమ్మ‌లుగా ఉండ‌టం ఈ ప్ర‌భుత్వంలోనే చూస్తున్నామ‌ని చెప్పారు. దానికి గ‌త రెండున్న‌రేళ్ళుగా జ‌రిగిన పాల‌నే సాక్ష్య‌మ‌ని అన్నారు. మంత్రులకే అపాయింట్‌మెంట్ ఇవ్వ‌ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి వీరికి.. స్వీయ నిర్ణ‌యాధికారాలు తీసుకొనే వీలు క‌ల్పిస్తారా అనుకోవాల‌ని ఆయ‌న అనుమానం వ్య‌క్తం చేశారు.

అల్లూరి సీతారామ‌రాజు జిల్లా అంటే ముఖ్య‌మంత్రికి చుల‌క‌న‌?


పాల‌నా వికేంద్రీక‌ర‌ణ పేరుతో అస్త‌వ్య‌స్తంగా జిల్లాలు ఏర్ప‌డిన విష‌యం గ‌ర్తు చేస్తూనే నూత‌నంగా ఏర్ప‌డిన అల్లూరి సీతారామ‌రాజు జిల్లా అంటే అంత చుల‌క‌న ఏంట‌ని జ‌న‌సేన అర‌కు పార్ల‌మెంట్ ఇన్‌చార్జ్ డా.వంపూరు గంగుల‌య్య ప్ర‌శ్నించారు. అల్లూరి సీతారామ‌రాజు జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నార‌ని, వారిలో ఎవ‌రూ మంత్రి ప‌ద‌వికి అర్హులు కారా ? అని నిల‌దీశారు. అలాంటి అస‌మ‌ర్థుల‌కు వైఎస్సార్‌సీపీ త‌రఫున టికెట్‌లు ఎందుకిచ్చార‌ని ప్ర‌శ్నించారు. అల్లూరిసీతారామ‌రాజు జిల్లా ప్ర‌జ‌లు ఏదైనా స‌మ‌స్య‌పై మంత్రులను క‌ల‌వాల‌నుకుంటే ప‌క్క జిల్లాల‌కే వెళ్ళాల్సిన దౌర్భాగ్యం క‌ల్పించిన జ‌గ‌న్ రెడ్డికి త‌మ జిల్లా విష‌యంలో పాలనా వికేంద్రీక‌ర‌ణ ఎక్క‌డుందో చెప్ప‌మ‌ని కోరారు.

ఉప ముఖ్య‌మంత్రి గిరిజ‌నుల త‌రపున ప‌నిచేయాలి

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉప‌ముఖ్య‌మంత్రిగానూ, పంచాయ‌తీల శాఖామంత్రిగానూ బాధ్య‌త‌లు చేప‌ట్టిన బూడి ముత్యాల‌నాయుడు గిరిజ‌నుల ప‌క్షాన నిల‌బ‌డాల‌ని కోరారు. ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న 14 గిరిజ‌న గ్రామాల‌ను షెడ్యూల్ ఏరియాలో చేర్చేలా కృషి చేయాల‌న్నారు. మీ నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న గిరిజిన గ్రామాలు నేటికీ అభివృద్ధికి దూరంగా ఉన్నాయ‌ని త‌మ స‌హ‌కారంతో ఆ గ్రామాల‌ను పాడేరు జిల్లాలో క‌ల‌పాల‌ని ఈ సందర్భంగా డా.వంపూరు గంగుల‌య్య‌ కోరారు.