ధర్మారెడ్డి కి ఇంఛార్జి ఈఓ ఇవ్వడానికి కారణం ఏంటి…?

  • దేశంలో ఇంకెవరు ఐఏఎస్ లు లేరా?
  • కాలం తీరిన తర్వాత కూడా ఆ ధర్మారెడ్డిని కొనసాగిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తాం…
  • టీటీడీ పాలక మండలి సమావేశంలో టికెట్లు వాటాలు వేసుకుంటున్నారు.
  • స్వీట్ షాప్ లో మాదిరిగా శ్రీవారి లడ్డూ, వడలను అమ్మేస్తున్నారు.
  • శ్రీవారి ఆర్జిత తదితర సేవా కైంకర్యాలను రద్దు చేసే హక్కు పాలకులకు ఎవరిచ్చారు…?
  • జనసేన పార్టీ ప్రశ్నిస్తూ , హెచ్చరిక.

తిరుమల తిరుపతి దేవస్థానంలో 1999 బ్యాచ్ జె.ఈ.ఓ గా అడుగు పెట్టిన ధర్మారెడ్డి ఆనాటి నుండి దేవస్థానంలో తిష్టవేసి నేడు వైసిపి పాలనలో అధర్మారెడ్డిగా పేరు గడించి ప్రపంచవ్యాప్తంగా పవిత్రంగా కొలిచే శ్రీ వెంకటేశ్వర స్వామిని సీఎం జగన్ కు తాకట్టు పెట్టాడని, జనసేన ప్రముఖ నేతలు చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్, రాజారెడ్డి, రాజేష్ యాదవ్, సుభాషిని, సుమన్ బాబు, మునస్వామి, కీర్తన, కోకిల, పార్ధు, చిన్నా రాయల్, లోకేష్,కొండా రాజమోహన్, సుమన్, మనోజ్, కృష్ణ, రాజేష్ లతో కలిసి హరిప్రసాద్, కిరణ్ రాయల్ లు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఉదయ్ ఇంటర్నేషనల్ హోటల్ లో మంగళవారం మీడియాతో వీరు మాట్లాడుతూ శ్రీవారి దేవస్థానాన్ని నువ్వే కాపాడుకోవాలి – గోవిందా అంటూ నినాదాలు చేస్తూ వీరి నినాదాలు తిరుమలకు వినబడేలా అర్ధించారు. వైసీపీ పాలనలోకి వచ్చాక టిటిడి ఆస్తులను అమ్మి సొమ్ము చేసుకోవాలని ప్రయత్నించారని ఆరోపించారు, అలాగే రథసప్తమి తో పాటు ఆర్జిత సేవ తదితర కైంకర్యాలు, ఏకాంత సేవను కూడా రద్దుచేసి శ్రీవారి దర్శన సమయాన్ని పెంచి వ్యాపార కోణంలో ఆధ్యాత్మికత భక్తి భావాలు సన్నగిల్లేలా నేటి ప్రభుత్వ టీటీడీ పాలకమండలి వ్యవహరిస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ అధర్మ – ధర్మారెడ్డిని టీటీడీ తో పాటు ఎస్.వి.బి.సి, వేదిక్ యూనివర్సిటీ తదితర సంస్థలలో కూడా అధిపతిగా వ్యవహరించేలా కిరీటాన్ని పెట్టి వైకాపాకు దేవస్థానాన్ని దోచిపెట్టేలా ప్లాన్ చేశారని ఆరోపించారు, అతి పవిత్రమైన తిరుమల ప్రసాద రుచిని పూర్తిగా తగ్గించి ప్రసాదం రేట్లు పెంచి ఎక్కడపడితే అక్కడ దొరికేలా ప్రసాదానికి విక్రయిస్తూ తిరుమల పవిత్రతను దెబ్బతీశారని విమర్శించారు. ఈ నెల 14వ తేదీకి ధర్మారెడ్డి పదవీకాలం ముగుస్తుందని, తరువాత టిటిడిలో ధర్మారెడ్డిని కొనసాగిస్తే ఊరుకోమని అన్ని రాజకీయ పార్టీలు వామపక్షాలు, అఖిల పక్షాలు, ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.