పల్లె పాలనకు పైసలెక్కడ?: డా. పసుపులేటి

  • కనీస గౌరవం లేని సర్పంచ్ లు
  • వాలంటీర్లకేమో రూ.5 వేలు.. సర్పంచ్ ల కేమో రూ.3 వేలు వేతనమా?
  • జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్

తిరుపతి: పంచాయతీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 14, 15 ఆర్ధికసంఘాల నిధులు సుమారు రూ.8,629కోట్లు రాష్ట్రప్రభుత్వం దారి మళ్లించడం దారుణమని ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డాక్టర్. పసుపులేటి హరిప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ ప్రగతికి పల్లెలే పట్టుగొమ్మలు అన్న నినాదాన్ని జగన్ సర్కార్ నీరుగార్చిందన్నారు. ఈ మేరకు ఆయన గురువారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. పంచాయితీ ఖాతాల్లో పడిన నిధులను గంటల వ్యవధిలోనే దొంగలు పడ్డట్టు పడి దారి మళ్లించడం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వం పంచాయితీలకు విడుదల చేసిన నిధులను దారి మళ్లించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదన్నారు. జగన్ మోహన్ రెడ్డి బటన్ నొక్కడం కోసం సర్పంచ్ ల పీక నొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ ప్రధమ పౌరుడైన సర్పంచ్ లను ఉత్సవ విగ్రహాలుగా మార్చారన్నారు. చివరకు వాలంటీర్లకు అయిదు వేలు వేతనం ఇస్తున్న ప్రభుత్వం.. సర్పంచ్ లకు మూడు వేలు వేతనం ఇవ్వడం దారుణమన్నారు. చాలా గ్రామాల్లో నిధులు లేక… సర్పంచ్ లు అప్పులు చేసి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారన్నారు. కనీసం బ్లీచింగ్ పౌడర్ కు కూడా నిధులు లేక చాలా గ్రామాల్లో పారిశుధ్ద్యం పడకేసిందన్నారు. గ్రామాలను అధోగతి పాలుజేసిన వైసిపి ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపే సమయం ఆసన్నమైందని ఆయన ఆ పత్రికా ప్రకటనలో ఎద్దేవా చేశారు.