ఆర్యవైశ్యులపై జగన్ రెడ్డికి ఎందుకింత కక్ష?

  • గతంలో ఎన్నడూ లేనంతగా వైసీపీ ప్రభుత్వంలో ఆర్యవైశ్యులపై పెరిగిన దాడులు, బెదిరింపులు
  • నమ్మి గెలిపించినందుకు ఆర్యవైశ్యులకు అడుగడుగునా అవమానాలే అంటూ ఆవేదన
  • సమాజ సేవలో, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఆర్యవైశ్యులదే కీలకపాత్ర
  • వచ్చే ఎన్నికల్లో ఆర్యవైశ్యుల కోపాగ్ని ఎలా ఉంటుందో వైసీపీకి తెలియచేస్తాం
  • జనసేన పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్

గుంటూరు: గత సార్వత్రిక ఎన్నికల్లో ఆర్యవైశ్యులందరూ గంప గుత్తగా ఓట్లేసి వైసీపీని అధికారంలోకి తీసుకువచ్చారని, అప్పటినుంచి గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో ఆర్యవైశ్యులపై బెదిరింపులు, దాడులు పెరిగిపోయాయని జనసేన పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ మండిపడ్డారు. ఆర్యవైశ్యులంటే వైసీపీ ప్రభుత్వానికి చులకనగా ఉందని, నమ్మి గెలిపించిన పాపానికి అడుగడుగునా అవమానాలకు గురిచేస్తున్నారని అసలెందుకు జగన్ రెడ్డికి ఆర్యవైశ్యులపై ఇంత కక్ష అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. స్వాతంత్ర్య సమయోధులు పూజ్య బాపూజీ మహాత్మాగాంధీ నడయాడిన గాంధీ పార్కులో ఆయన విగ్రహాన్ని నెలకొల్పకుండా పార్కు ప్రారంభిచటానికి సమాయత్తం అవుతున్న నగరపాలక సంస్థ పాలకులపై, అధికారులపై ఆయన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. భారతదేశ స్వాతంత్ర్య సమరంలోనూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధిలోనూ ఆర్యవైశ్యులు పోషించిన చరిత్రను ఒకసారి వైసీపీ నేతలు తెలుసుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధనకై , భాషా సంయుక్త రాష్ట్ర కోసం 58 రోజులు నిరాహారదీక్ష చేసి ప్రాణాలను అర్పించిన పొట్టి శ్రీరాములు త్యాగనిరతిని వైసీపీ నేతలు మరచిపోయినా ప్రజల హృదయాల్లో ఆయన స్థానం శాశ్వతమన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆర్ధిక శాఖను సమర్ధవంతంగా నిర్వర్తించిన మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ కొణిజేటి రోశయ్య గారు చనిపోయినప్పుడు కూడా ముఖ్యమంత్రి హోదాలో ఉండి కనీసం ఆయన పార్ధీవ దేహాన్ని కూడా సందర్శించకుండా జగన్ రెడ్డి అవమానించారన్నారు. చివరికి సొంత పార్టీకి చెందిన నెల్లూరు ఆర్యవైశ్య నేత గుప్తాపై వైసీపీ నేతలు ఎలాంటి భౌతికదాడులకు పాల్పడ్డారో ప్రజలందరూ చూశారన్నారు. ప్రతినిత్యం ప్రజలతో మమేకమవుతూ ఒకవైపు సమాజ సేవలోనూ, మరోవైపు ఆధ్యాత్మిక సేవలోనూ తరించే ఆర్యవైశ్యులను అవమానించటం, బెదిరింపులకు పాల్పడటం సమాజానికి శ్రేయస్కరం కాదన్నారు. తమని ఎన్ని విధాలుగా అవమానించినా, తమపై ఎన్ని దాడులు చేసినా మౌనంగా భరించటం మినహా ఆర్యవైశ్యులేమి చేయలేరన్న ధీమాలో వైసీపీ నేతలున్నారని తామేంటో, ఆర్యవైశ్యుల కోపాగ్ని ఎలా ఉంటుందో రానున్న ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం చూడబోతుందన్నారు. మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసాకే పార్కుని ప్రారంభించాలని నగరపాలక సంస్థ పాలకులను, అధికారులను కోరారు. లేనిపక్షంలో జనసేన పార్టీ తరుపున ఆందోళనలు చేపడతామని నేరేళ్ళ సురేష్ హెచ్చరించారు.