అమలు చేయడం చేతకానప్పుడు హామీలెందుకు ఇచ్చారు?: ఆళ్ళ హరి

*పేదల జీవితాలతో చెలగాటం ఆడుతున్న వైసీపీ ప్రభుత్వం

*కరోనా లాంటి విపత్కర సమయాల్లో పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలకు తెగించి చేసిన సేవలు అప్పుడే మరచిపోయారా ముఖ్యమంత్రి గారు?

*అసమర్థత, అవగాహనారాహిత్యం, అవినీతి, అరాచకత్వమే ఆలంబనగా దుష్ప్రరిపాలన

*వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆనందంగా లేరు.

*డిమాండ్లు నెరవేరేవరకు కార్మికులకు అండగా నిలుస్తాం

*జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి

మాట తప్పుడు మడమ తిప్పుడు పోటీల్లో దేశవ్యాప్తంగా వైసీపీ మొదటి స్థానంలో ఉందని, అమలు చేయడం చేతకానప్పుడు ప్రజలకు హామీలెందుకు ఇచ్చారంటూ జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి వైసీపీ నేతల్ని ప్రశ్నించారు. మున్సిపల్ కార్మికుల సమ్మె నాలుగో రోజు చేరుకున్న సందర్భంగా కార్మిక సంఘ నేతలతో కలిసి అర్ధ నగ్న ప్రదర్శనతో జనసేన నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆళ్ళ హరి మాట్లాడుతూ కార్మికులు చేసే పనికి లక్ష రూపాయలు ఇచ్చినా తక్కువేనన్న ముఖ్యమంత్రి ఇప్పుడు ఉన్న జీతాల్లో సైతం కోత పెట్టడం దుర్మార్గమన్నారు. కరోనా సమయంలో పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తించిన సంగతి వైసీపీ నేతలు అప్పుడే మరచిపోవటం శోచనీయం అన్నారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చమన్నందుకు మంత్రులకు ఎక్కడ లేని కోపం వస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పేరుకుపోయిన చెత్తని 151 శాసనసభ్యులు, 22 మంది పార్లమెంట్ సభ్యులు స్వయంగా ఒక్కరోజన్నా శుభ్రం చేస్తే కార్మికుల కష్టం ఏమిటో తెలుస్తుందన్నారు. ఏ ప్రభుత్వంలోనైనా కార్మికులకు, ఉద్యోగులకు జీతాలు పెరుగుతాయి కానీ ఈ వైసీపీ ప్రభుత్వంలో మాత్రం ఉన్న జీతాలను తగ్గిస్తున్నారని రాష్ట్ర చరిత్రలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదని విమర్శించారు. ఒకవైపు నిత్యావసర సరుకుల ధరలు కొండెక్కి కూర్చున్నాయి మరోవైపు కరెంట్, బస్సు ఛార్జీలు, పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్నంటాయి ఇటువంటి పరిస్థితుల్లో పన్నెండు వేల రూపాయల జీతంతో కార్మికుల కుటుంబాలు ఎలా గడుస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల సమస్యలను పరిష్కరించటంలో ప్రభుత్వ మొండివైఖరి సరికాదన్నారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే కార్మికల పక్షాన ప్రజల్లో తిరుగుబాటు వచ్చే ప్రమాదం ఉందని ఆళ్ళ హరి హెచ్చరించారు. నగర జనసేన పార్టీ కార్యదర్శి సూదా నాగరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఒక్కసారి తాడేపల్లి ప్యాలెస్ వదిలి ప్రజల్లోకి వస్తే ప్రజలు ఎదురుకుంటున్న సమస్యలు తెలుస్తాయ న్నారు. కార్మికుల, ఒప్పంద ఉద్యోగుల సమస్యలకు కూడా పరిష్కారం చూపలేని దుస్థితిలో ప్రభుత్వం ఉండటం సిగ్గుచేటన్నారు. సమస్యలకు పరిష్కారం చూపకుండా సమ్మె విరమించమనటం సరికాదని, తాము చేసిన శ్రమకు తగ్గ ప్రతిఫలం ఆశించటమే కార్మికులు చేసిన తప్పా అని సూదా నాగరాజు ప్రశ్నించారు. మున్సిపల్ యూనియన్ రాష్ట్ర నాయకులు సోమి శంకరరావు మాట్లాడుతూ ప్రభుత్వం మొండివైఖరి వీడకపోతే సమ్మెను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ మొద్దు నిద్రని ఎలా భగ్నం చేయాలో కార్మికులకు బాగా తెలుసని పరిస్థితిని చెయ్యి దాటకుండా చూసుకోవాలని ప్రభుత్వ పెద్దల్ని హెచ్చరించారు. సమ్మెలో భాగంగా రేపు నగరపాలక సంస్థ ముట్టడికి శంకరరావు పిలుపునిచ్చారు. అనంతరం హిమని సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో రెల్లి రాష్ట్ర నాయకులు సోమి ఉదయ్ , జనసేన పార్టీ నగర కార్యదర్శి బుడంపాడు కోటి , కొనిదేటి కిషోర్ , మెహబూబ్ బాషా, అజయ్ , విజయ్ , నాగరాజు , మెహముద్దీన్ తదితరులు పాల్గొన్నారు.