రంగారెడ్డి జిల్లా వేదిక గా ‘ధరణి’ పోర్టల్ ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధరణి పోర్టల్ ప్రారంభానికి రంగారెడ్డి జిల్లా వేదిక కానుంది. ఈ నెల 29న మధ్యాహ్నం 12.30 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ధరణి పోర్టల్ ను ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

‘ధరణి’ నిర్వహణపై తాసిల్దార్లకు ఒకరోజు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో మంగళవారం ఘట్‌కేసర్‌ సమీపంలోని అనురాగ్‌ యూనివర్సిటీ క్యాంపస్‌లో శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణకు తాసిల్దార్లు, నాయబ్‌ తాసిల్దార్లు, కంప్యూటర్‌ ఆపరేటర్లు హాజరయ్యారు. వీరికి ఉదయం థియరీ క్లాసులు, సాయంత్రం ప్రాక్టికల్‌ క్లాసులు నిర్వహించనున్నారు.

ధరణి ప్రారంభం తర్వాత రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు, ఇతర భూ సంబంధమైన కార్యక్రమాలన్నీ జరుగుతాయి. కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తున్న నేపథ్యంలో సెప్టెంబర్‌ 8 నుంచి రాష్ట్రంలో భూముల క్రయవిక్రయాలను రాష్ట్రప్రభుత్వం నిలిపివేసింది. అక్టోబర్‌ 29 నుంచి అవన్నీ పునర్‌ప్రారంభమవుతాయి.