జనసేన, టిడిపి పొత్తుతో- వైసీపీలో వణుకు!

  • పాలనపై దృష్టి పెట్టి కనీసం రోడ్డు గోతులు కప్పాలి
  • ఉన్న కొద్దిపాటి నెలలైనా ప్రజల రుణం తీర్చుకునేలా పాలించాలి
  • పరిశ్రమలు స్థాపించి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి
  • ప్రభుత్వ ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ తో పాటు నోటిఫికేషన్ ఇవ్వాలి
  • సమస్య పరిష్కారమయ్యేంతవరకు టిడిపి నిరసన కార్యక్రమాలకు మద్దతు
  • వైసీపీని ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న జనసేన పార్టీ నాయకులు

పార్వతీపురం నియోజకవర్గం: జనసేన, టిడిపి పార్టీల పొత్తుతో వైసీపీలో వణుకు మొదలైందని జనసేన పార్టీ నాయకులు అన్నారు. శనివారం పార్వతీపురం పట్టణ మెయిన్ రోడ్ లో టిడిపి చేపడుతున్న నిరసన దీక్షలో జనసేన పార్టీ నాయకులు వంగల దాలినాయుడు, అన్నాబత్తుల దుర్గాప్రసాద్, పసుపురెడ్డి ప్రసాద్, తెంటు సురేష్, దువ్వాన మృత్యుంజయనాయుడు, గవర ఈశ్వరరావు తదితరులు పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న వైసీపీని ఓడించేందుకు వచ్చే ఎన్నికల్లో జనసేన టిడిపి కలిసి పోటీ చేస్తాయని జనసేనాని కొణిదల పవన్ కళ్యాణ్ ప్రకటించినప్పటి నుంచి వైసీపీ శ్రేణుల్లో వణుకు మొదలైందన్నారు. ముఖ్యంగా కొందరు మంత్రులకైతే నిద్రపట్టే పరిస్థితి లేదన్నారు. ఎందుకంటే వారి శాఖల పనులు పక్కనపెట్టి పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా దూషించే పనిలో ఉన్నారన్నారు. వారి శాఖల అభివృద్ధిని పక్కన బెట్టి జనసేన టిడిపి పొత్తు పెట్టుకున్నాయంటూ గగ్గోలు పెడుతున్నారన్నారు. పదవిలో ఉన్న కొన్ని నెలలైనా ఒకసారి ఛాన్స్ ఇచ్చిన ప్రజల రుణం తీర్చుకునేలా పాలన సాగించాలన్నారు. కనీసం రోడ్డు గోతులనైనా కప్పేలా కష్టపడాలన్నారు. పరిశ్రమలు స్థాపించి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో పని చేయాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ తో పాటు నోటిఫికేషన్ లు ప్రకటించాలన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, రవాణా తదితర రంగాల అభివృద్ధికి పాటుపడాలన్నారు. పెరుగుతున్న నిత్యవసర ధరలను తగ్గించి ప్రజలకు మేలు చేసేలా పాలన సాగించాలన్నారు. ఇప్పటికే ప్రజలు వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించేందుకు సిద్ధమయ్యారన్నారు. హద్దు అదుపు లేకుండా పెరుగుతున్న నిత్య అవసరాల ధరలు, పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గించాలన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు చేపడుతున్న నిరసన దీక్షకు సమస్య పరిష్కారం అయ్యేంతవరకు తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసైనికులు పాల్గొన్నారు.