భారత్, ఆస్ట్రేలియా మూడో టెస్టులో ఫోర్త్ అంపైర్ గా మహిళ!

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా మూడో టెస్టు రేపు (జనవరి 7) ప్రారంభం కానుంది. సిడ్నీ వేదికగా జరిగే ఈ మ్యాచ్ ఓ అరుదైన నియామకానికి వేదికగా నిలుస్తోంది. చరిత్రలో తొలిసారిగా ఓ మహిళా అంపైర్ పురుషుల టెస్టు క్రికెట్ లో విధులు నిర్వర్తించనున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన క్లెయిర్ పోలోసాక్ సిడ్నీ టెస్టులో ఫోర్త్ అంపైర్ గా బాధ్యతలు చేపట్టనున్నారు.

ఈ టెస్టుకు పాల్ రీఫెల్, పాల్ విల్సన్ ప్రధాన అంపైర్లు కాగా, బ్రూస్ ఆక్సెన్ ఫోర్డ్ థర్డ్ అంపైర్ గా వ్యవహరిస్తారు. వీరితోపాటే క్లెయిర్ పోలోసోక్ మ్యాచ్ నిర్వహణలో పాలుపంచుకోనున్నారు.

క్లెయిర్ పోలోసాక్ ఇంతక్రితం పురుషుల వన్డే క్రికెట్ లోనూ మొట్టమొదటి మహిళా అంపైర్ గా రికార్డు సృష్టించారు. 2019లో జరిగిన వరల్డ్ క్రికెట్ లీగ్ డివిజన్-2 పోటీల్లో నమీబియా, ఒమన్ జట్ల మధ్య జరిగిన వన్డేకు అంపైర్ గా వ్యవహరించారు. కాగా, టెస్టు క్రికెట్ లోనూ తనకు అవకాశం దక్కడం పట్ల క్లెయిర్ పోలోసాక్ మాట్లాడుతూ, ఇది ఆరంభం మాత్రమేనని, తన బాటలోనే మరింత మంది మహిళలు పయనిస్తారని భావిస్తున్నట్టు తెలిపారు.