సమాజంలో సహనానికి, ఓర్పుకు పెట్టింది పేరు మహిళలే

— మహిళలు ఎక్కడ గౌరవించ బడతారో, దేవతలు అక్కడ పూజింప బడతారన్న వి.సి.
— ఏ.కే.యూలో ముందస్తుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు.

సమాజంలో సహనానికి, ఓర్పుకి పెట్టింది పేరు మహిళలేనని, ఏటువంటి మహిళలు ఎక్కడైతే పూజింప బడతారో, అక్కడ దేవతలు వర్ధిల్లుతారని ఆంధ్ర కేసరి యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డి.వి.ఆర్ మూర్తి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను ఆంధ్ర కేసరి యూనివర్శిటీ ప్రాంగణంలో ముందస్తుగా శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ఆంధ్ర కేసరి యూనివర్శిటీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రాజ మోహన్ రావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ముందుగా ముఖ్య అతిథిగా విచ్చేసిన వి.సి ప్రొఫెసర్ మూర్తి, ప్రత్యేక అతిథిగా పాల్గొన్న స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఒంగోలు డి.ఐ.జి డాక్టర్ పుష్పలత, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రాజ మోహన్ రావు తదితరుల ఆద్వర్యంలో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వి.సి ప్రొఫెసర్ డి.వి.ఆర్.మూర్తి మాట్లాడుతూ రెండవ ప్రపంచ యుద్ధానంతరం బాధితులను, బాధిత కుటుంబాలను ఆడుకున్నది ఆనాటి రోజుల్లో మహిళలే అని ఆయన గుర్తు చేశారు.1950 సంవత్సరం తర్వాత మహిళలకు అన్ని రంగాలలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని అన్నారు.నేడు స్త్రీలు సమానత్వం కోసం కృషి చేస్తున్నారని, నేటి సమాజంలో సగ భాగమైన మహిళలను గౌరవించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు. ఆనాటి రోజుల్లో ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అనే నినాదంతో మహిళలు విద్యా విషయాల్లో ముందు వరుసలో వుండే వారని, అయితే నేడు ఇంటికి వెలుగు ఇల్లాలు అనే సామెత సమాజంలో గణనీయమైన ప్రాచుర్యాన్ని పొందినట్లు ఆయన అన్నారు.ప్రత్యేక అతిథిగా విచ్చేసిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఒంగోలు డి.ఐ.జి. డాక్టర్ పుష్పలత మాట్లాడుతూ ఓర్పు, సహనం అనేవి రెండు కూడా మహిళలకు బాల్యం లోనే అమ్మ ద్వారా అలవడు తాయని, సదరు అమ్మ కూడా స్త్రీ మూర్తి కావడం సంతోషించ దగిన విషయమని ఆమె పేర్కొన్నారు.మారిన కాలానికి అనుగుణంగా మహిళలు కూడా విద్యా, వైద్య, ఉపాధి, పారిశ్రామిక రంగాల్లో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ముందుకు సాగాలని సూచించారు.మరొక ప్రత్యేక అతిథి, ఒంగోలుకు చెందిన ఆయుష్ విభాగం వైద్యురాలు డాక్టర్ భ్రమరాంబ సభికులను ఉద్దేశించి మాట్లాడుతూ మహిళలు వృద్ధి చెందడానికి స్వయం నమ్మకం ఎంతో అవసరమని, ప్రతి ఒక్క మహిళలో శరీరం, మనస్సు ఏకాగ్రతగా ఉండాలంటే ధ్యానం చేయడం, ఆసనాలు వేయడం ఎంతో మంచిదని ఆమె మహిళలకు సూచించారు.సభాధ్యక్షుడు,ఆంధ్ర కేసరి యూనివర్శిటీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రాజ మోహన్ రావు మాట్లాడుతూ పురాతన కాలం నుంచి మహిళలు ఎంతగానో గౌరవించబడుతూ ఉన్నారని, ఆనాటి రోజుల్లో స్త్రీ జనోద్ధరణ కోసం అనేక మంది సంఘ సంస్కర్తలు తమ శక్తి సామర్థ్యాలను వినియోగించి కృషి చేశారని అన్నారు. పూర్వ కాలం నుంచి అఖండ భారతావని వెనుక బడటానికి వర్ణ వ్యవస్థ, స్త్రీల అసమానతలే ప్రధాన కారణమని ప్రముఖ చరిత్రకారుడు జే.ఎస్.మిల్ పేర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రొఫెసర్ రాజ మోహన్ రావు సమావేశంలో వెల్లడించారు. ఇంకా ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్ నిర్మలా మణి, సి.డి.సి డీన్ ప్రొఫెసర్ సోమ శేఖర, ఏ.సి.ఈ డాక్టర్ అంచుల భారతీ దేవి,ఎన్.ఎస్.ఎస్ కో ఆర్డినేటర్ డాక్టర్ మండే హర్ష ప్రీతం దేవ్ కుమార్, నాన్ కాన్ఫిడెన్షియల్ విభాగం పి.జి కో ఆర్డినేటర్ డాక్టర్ ఆర్. శ్రీనివాస్, ఎం.ఎడ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అమృతవల్లి లతో బాటు బోధన, బోధనేతర సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఆంధ్ర కేసరి యూనివర్శిటీ ఆద్వర్యం లో ప్రత్యేక అతిథులుగా హాజరైన డాక్టర్ పుష్పలత, డాక్టర్ భ్రమరాంబలతో పాటు యూనివర్శిటీ నందు పనిచేస్తున్న మహిళా ఉద్యోగులలో అన్ని స్థాయిలలో పని చేస్తున్న మహిళలను ప్రత్యేకంగా సన్మానించి, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Share this content:

Post Comment