*ఏపీఎంసీడీసీ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు
మంగళగిరి, జూన్ 24: రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం హానికరమని, ప్రజలను భయపెట్టేలా ‘చంపుతాం, నరుకుతాం’ వంటి మాటలు చెప్పడం పూర్తిగా అప్రజాస్వామికమని జనసేన పార్టీ మంగళగిరి ఇంచార్జ్, ఏపీఎంసీడీసీ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. మంగళగిరి జనసేన నియోజకవర్గ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో యువత గంజాయి మత్తుకు బానిసలయ్యారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గంజాయి నిర్మూలనతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌లు కలసి ప్రజలకు నమ్మకం కలిగించారని చెప్పారు. జగన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలతో పార్టీ కార్యకర్తలు రక్తచరిత్ర సృష్టిస్తారన్న సంగతి తెలిసినా ఆ దిశగా ప్రేరేపించడం హానికరమని వ్యాఖ్యానించారు. పల్నాడులో జరిగిన ప్రమాదంలో తన పార్టీ కార్యకర్తను కాపాడకుండా నిర్లక్ష్యంగా ముందుకు వెళ్లిన జగన్, మరణించిన కార్యకర్తకు నివాళులర్పించడానికి వెళ్లడం, గంజాయి ముఠాలను పరామర్శించడం పౌరసత్వ బాధ్యతలతో కూడిన నాయకత్వానికి తీరని మచ్చగా నిలుస్తుందని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ అధికారంలో లేకపోయినా ప్రజల భద్రత కోసం శ్రద్ధ వహించారని, జనసైనికుల కోసం భీమా పథకాన్ని అమలు చేసి బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చారని గుర్తు చేశారు.
అమరావతిని నిర్వీర్యం చేసి రాష్ట్రాన్ని మాఫియా పాలనతో నాశనం చేసిన వైసీపీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రజల అభివృద్ధికి సూచనలు ఇవ్వాలని సూచించారు. ఈ సమావేశంలో గుంటూరు జిల్లా జనసేన సంయుక్త కార్యదర్శి బడే కోమలి, ఎంటిఎంసి ఉపాధ్యక్షుడు షేక్ కైరుల్లా, మంగళగిరి మండల అధ్యక్షుడు వాసా శ్రీనివాసరావు, తాడేపల్లి మండల అధ్యక్షుడు సామల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment