కార్యకర్తల కష్టాన్ని గుండెల్లో దాచుకుంటా:పెమ్మసాని చంద్రశేఖర్

గుంటూరు, ఏ రాజకీయ పార్టీకైనా కార్యకర్తలే కొండంత అండ అని, పార్టీ విజయంలో కార్యకర్తల కృషిని, త్యాగాన్ని గుండెల్లో దాచుకుంటానని గుంటూరు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విడుదల చేసిన మూడవ జాబితాలో గుంటూరు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించిన నేపధ్యంలో జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి ఆయనను దుస్సాలువాతో సన్మానించి, స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ పార్టీ విజయంలో భాగస్వామ్యులైన ప్రతీ కార్యకర్తకు మంచి భవిష్యత్తు ఉండేలా తాను స్వయంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జన్మభూమి రుణం తీర్చుకునే అవకాశం ఇప్పుడు లభించిందని, ప్రజలు తనను ఆశీర్వదించాలని కోరారు. పార్లమెంట్ పరిధిలో కొన్నాళ్లుగా పేరుకుపోయిన సమస్యల్ని వీలైనంత త్వరగా పరిష్కరిస్తామన్నారు. ముఖ్యంగా కేంద్ర నిధులతో ప్రతీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కేంద్ర సహకారం కోసం పార్లమెంటు లో తన గళాన్ని బలంగా వినిపిస్తామన్నారు. జనసేన-టీడీపీ-బీజేపీ, పొత్తు రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని వ్యాఖ్యానించారు. క్షేత్రస్థాయిలో అందరూ సమిష్టిగా కృషి చేసి వైసీపీని రాష్ట్రం నుంచి తరిమేయాల్సిన అవసరం ఉందని పెమ్మసాని అన్నారు. జిల్లా జనసేన అధికార ప్రతినిధి ఆళ్ళ హరి మాట్లాడుతూ పెమ్మసాని చంద్రశేఖర్ రాజకీయ అరంగేట్రంలోనే సంచలనాలకు కేంద్ర బిందువుగా మారారన్నారు. పెమ్మసాని తొలి అడుగు నవశఖానికి నాంది అంటూ ప్రజల హృదయాలకు దగ్గరయ్యాడని కొనియాడారు. పెమ్మసాని లాంటి విద్యావంతులు పార్లమెంటు కు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పెమ్మసాని గెలుపు కోసం జనసేన క్షేత్రస్థాయిలో అత్యంత బలంగా కృషి చేస్తుందని ఆళ్ళ హరి తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ బీ ఆర్ అంభేడ్కర్ ప్రసంగాల పుస్తకాన్ని పెమ్మసానికి మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు గోళ్ల అరుణ్ కుమార్, రాష్ట్ర రెల్లి యువత నాయకుడు సోమి ఉదయ్ కుమార్, మైనారిటీ నేత సయ్యద్ షర్ఫుద్దీన్ అందించారు. కార్యక్రమంలో షేక్ నాజర్ వలి, నండూరి స్వామి, అలా కాసులు, స్టూడియో బాలాజీ, గడ్డం రోశయ్య తదితరులు పాల్గొన్నారు.