వైసీపీ అరాచకాలు.. ప్రభుత్వ విధానాలతో ప్రజల అవస్థలు.

• మచిలీపట్నం జనసేన- జనవాణికి క్యూ కట్టిన సమస్యలు
• అర్జీలతో వచ్చిన కాంట్రాక్టు ఉద్యోగులు.. నిరుద్యోగులు.. వివిధ వర్గాల ప్రజలు
• జనవాణి చెంతకు 200కు పైగా అర్జీలు

వైసీపీ ప్రభుత్వం మా ఉద్యోగాలు తీసేసేందుకు చూస్తోంది.. వైసీపీ నాయకులు మా స్థలం కబ్జా చేశారు. మాకు పెన్షన్లు రావడం లేదు.. మా ఉద్యోగాలు పర్మినెంట్ చేస్తామని చెప్పి మోసం చేశారు.. చివరి మజిలీకి మాకు ఖబరస్థాన్ కూడా లేదు.. వైసీపీ ప్రభుత్వ దాష్టీకాలు.. దౌర్జన్యాలతోపాటు ప్రభుత్వ విధానాలతో ఇబ్బందులుపడుతున్న వివిధ వర్గాల ప్రజలు మచిలీపట్నం వేదికగా నిర్వహించిన జనవాణి- జనసేన భరోసా కార్యక్రమంలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి వద్దకు అర్జీలతో క్యూ కట్టారు. వైసీపీ ప్రభుత్వ విధానాలతో పడుతున్న అవస్థలపై పలు వర్గాల ప్రజలు జనసేనాని ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు. సుమారు 200 అర్జీలు జనవాణి కార్యక్రమానికి వచ్చాయి.
• ప్రభుత్వం పొమ్మనకుండా పొగపెడుతోంది – ఏపీ మీటర్ రీడర్స్ సంఘం
వైసీపీ ప్రభుత్వం వచ్చిన రెండేళ్లకే మమ్మల్ని తొలగిస్తామని చెప్పింది. స్మార్ట్ మీటర్స్ తీసుకువచ్చి మమ్మల్ని తీసేయాలని చూస్తున్నారు. నెల రోజుల పని వారం రోజుల్లో చేయాలని ఒత్తిడి చేస్తూ పొమ్మనకుండా పొగపెడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటీ 95 లక్షల ఇళ్లలో మేము రీడింగులు తీస్తున్నాము. దాదాపు 4 వేల మంది ఉన్నాము. పాదయాత్రలో మధ్యవర్తులని తొలగిస్తామని, మీ సేవలు ఏదో విధంగా వినియోగించుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. కాంట్రాక్టు ఉద్యోగులుగా అయినా కొనసాగిస్తామని చెప్పారు. మాకు మీ మద్దతు కావాలని ఆంధ్రప్రదేశ్ మీటర్ రీడర్స్ సంఘం సభ్యులు కోరారు.
• చారిత్రక కళాశాలను కాపాడండి: శ్రీ సుబ్రహ్మణ్యం, ఏబీవీపీ నాయకులు
 మచిలీపట్నం ఆంధ్రా జాతీయ కళాశాల భూములను ఎండోమెంట్ శాఖకు అప్పగించి ఆ భూముల్లో నిర్మాణాలు చేస్తున్నారు. ఎంతో మందిని స్వాతంత్ర్య ఉద్యమం వైపు నడిపించిన ఈ కళాశాల కనుమరుగయ్యే పరిస్థితి తలెత్తింది. హిందూ కాలేజీకి చెందిన 15 ఎకరాల భూమిని కూడా రియల్టర్లకు అమ్మేశారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మేము చేస్తున్న పోరాటానికి మీ మద్దతు కావాలి.
• నా కొడుకు, కోడలు ఆత్మహత్య చేసుకున్నారు: శ్రీ లోకనాథం, చేనేత కార్మికుడు
చేనేత కార్మికుల జీవనం చాలా కష్టంగా మారింది. మాది పెడన. అప్పుల బాధతో నా కొడుకు, కోడలు ఆత్మహత్య చేసుకున్నారు. మగ్గం వర్కులకు ఆదరణ లేక అవస్థలు పడుతున్నాము. చేనేత కార్మికులు ఉపాధి కోసం దినసరి కూలీలుగా మారుతున్నారు. జగన్ ఏడాదికి రూ. 24 వేలు ఇచ్చి, 75 వేలు లాక్కుంటున్నాడు. చేనేత కార్మికులను ఆదుకుని, భరోసా కల్పించండి.
• పారా మెడికల్ ట్రైనింగ్ నిలిపేశారు: గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం
రాష్ట్ర వ్యాప్తంగా 75 వేల మంది గ్రామీణ వైద్యులం ఉన్నాము. 2009లో ఇచ్చిన 429 జీవో ప్రకారం మాకు పారా మెడికల్ స్టాఫ్ ట్రైనింగ్ ఇచ్చేవారు. ఇప్పుడు అర్ధంతరంగా నిలిపివేశారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు ఇవ్వలేదు. మా శిక్షణ పూర్తి చేసే ఏర్పాటు చేయాలి. మా సేవలు వినియోగించుకునే ఏర్పాటు చేయాలి.
• బధిరులకు ఉపాధి లేదు
రాష్ట్రవ్యాప్తంగా 50 వేల మంది బధిరులు ఉన్నాము. ఉపాధి అవకాశాలు లేవు. ప్రభుత్వ సెక్టార్ లో వీరికి కేటాయించిన పోస్టులు ఎప్పటి నుంచో ఖాళీగా ఉండిపోయాయి. వీరికి అందరితోపాటే 3 వేలు పెన్షన్ వస్తోంది. అది సరిపోవడం లేదు. దివ్యాంగుల కార్పొరేషన్ లో సైన్ లాంగ్వేజ్ తెలిసిన ఉద్యోగిని నియమించాలి. అలాంటి ఉద్యోగి లేకపోవడంతో మా బాధలు ఎవరికీ చెప్పుకోలేకపోతున్నాం. ఇంట్లో ఇద్దరు ఉంటే ఒకరికి పెన్షన్ తీసేశారు.
– శ్రీ సింగ్, (బధిరుడైన శ్రీ సింగ్ సైగల ద్వారా చెప్పగా దాన్ని శ్రీ శ్రీధర్ అనే వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వివరించారు)
నా కొడుకు పడమట తిరుమలరావు. జడ్జిగా పని చేసి కోవిడ్ సమయంలో చనిపోయారు. ఆయన చనిపోక ముందే 2018లో అతని భార్య విడాకులు తీసుకుంది. ఇప్పుడు మంత్రి జోగి రమేష్ అనుచరులు అర్జునరావు, సాంబ నాకున్న భూమి నుంచి ఎకరం 30 సెంట్లు ఆక్రమించుకున్నారు. నా భూమి నాకు ఇప్పించండి.
– – శ్రీమతి పడమట వెంకట సుబ్బమ్మ, మచిలీపట్నం
• అప్పుడు అర్హులం… ఇప్పుడు అనర్హులమా?: ఎస్.ఐ. అభ్యర్ధులు
రాష్ట్రంలో ఏటా 6500 ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులు ఇస్తామని ఈ ప్రభుత్వం మోసం చేసింది. గత ఏడాది నవంబర్ లో ఎస్సై పోస్టులకు నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. కొద్ది రోజుల కిందటే ఫిజికల్ టెస్ట్ జరిగింది. మెయిన్స్ రాత పరీక్షకు తగిన సమయం ఇవ్వడం లేదు. అలాగే ఎత్తు కొలిచేందుకు ఏర్పాటు చేసిన సెన్సార్లలో లోపాల వల్ల రెండు వేల మంది డిస్ క్వాలిఫై అయ్యారు. గతంలో ఎస్.ఐ. పోస్టులకు వెళ్లినప్పుడు మా ఎత్తు సరిపోయింది. ఇప్పుడు ఎలా అనర్హులమో అర్థం కావడం లేదు. పాదయాత్రలో నల్లగా ఉన్న జగన్ రెడ్డి.. అధికారం వచ్చిన ఆనందంలో తెల్లగా మారారు. రంగు మారొచ్చుగాని ఎత్తు ఎలా తగ్గిపోతామో అర్ధం కాలేదు.
• వైసీపీ వాళ్ళ ఆసుపత్రికి అడ్డు అని మా ఇళ్ళు కొట్టించేశారు: నంద్యాల బాధితులు
నంద్యాల నుంచి వచ్చాము సర్. రహదారి వెడల్పు చేస్తున్నామనే పేరుతో మా ఇళ్లు కొట్టేస్తున్నారు. మా తాతముత్తాతల నుంచి సుమారు వెయ్యి కుటుంబాలు అక్కడే నివాసం ఉంటున్నాము. అసలు విషయం ఏమిటంటే వైసీపీ నాయకులు తాము కడుతున్న ఆసుపత్రికి అడ్డుగా ఉందని మా ఇళ్లు కొట్టించేస్తున్నారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి దొంగపట్టాలు ఇచ్చి మోసం చేస్తున్నారు. ఇప్పటికి అలా నాలుగు సార్లు ఇచ్చారు. జగన్ రెడ్డి ప్రభుత్వం కూడా పట్టాలు ఇచ్చింది. స్థలాలు చూపడం లేదు.
• స్మారక భవనాన్ని ప్రభుత్వమే అడ్డుకొంటోంది
మచిలీపట్నం జిల్లా కోర్టు సెంటర్లో ఆంధ్రా బ్యాంక్ వ్యవస్థాపకులు, స్వతంత్ర సమరయోధులు శ్రీ భోగరాజు పట్టాభిసీతారామయ్య పేరిట ఏర్పాటు చేయదలచిన స్మారక భవనం నిర్మాణాన్ని ప్రభుత్వం అడ్డుకుంటోంది. మున్సిపల్ కార్పోరేషన్లో ఉన్న బలంతో అనుమతులు ఇవ్వడం లేదు. ఆ పక్కనే స్థలాన్ని కబ్జా చేసేసి మరీ వైసీపీ కార్యాలయం చకచకా కట్టేస్తున్నారు. యూనియన్ బ్యాంకు నిధులు ఇస్తామన్నా కార్పొరేషన్ అనుమతులు మంజూరు కావడం లేదు.