‘మా’ఎన్నికల్లో వైసిపి జోక్యం ఉంది: ప్రకాశ్ రాజ్

‘మా’ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని, తమ ప్యానల్ సభ్యులపై దాడి చేశారని ఇటీవల ఎన్నికల అధికారిని ప్రకాశ్ రాజ్ సీసీటీవీ ఫుటేజ్ కావాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ‘మా’ ఎన్నికల్లో వైసిపి జోక్యం ఉందంటూ శుక్రవారం మధ్యాహ్నం ప్రకాష్ రాజ్ ఆరోపణలు చేశారు. దీనిపై ఎన్నికల అధికారి కృష్ణమోహన్ కు ఫిర్యాదు చేశారు.

క్రిమినల్ రికార్డు ఉన్న వైసీపీ కార్యకర్త నూకల సాంబశివరావు వెంటబెట్టుకుని పోలింగ్‌లో మంచు ఫ్యామిలీ పాల్గొన్న ఫోటోలు  ప్రకాష్‌రాజ్ రిలీజ్ చేశారు. మా సభ్యులు కాని వ్యక్తులను ఎలా అనుమతించారని ప్రకాశ్ రాజ్ ప్రశ్నించారు. నూకల సాంబశివరావు అనే వ్యక్తి ఓటర్లను బెదిరించారని చెప్పారు. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రకాష్ రాజ్ డిమాండ్ చేశారు. ఈ విషయాలను తెలియజేస్తూ ఆయన ట్వీట్ చేశారు. ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని.. ఇప్పటికైనా సీసీ టివీ ఫుటేజ్ ఇవ్వాలని… పోలింగ్ బూత్ లో ఏం జరిగిందో ప్రపంచాలనికి తెలియచేయాలని ఎన్నికల అధికారి కృష్ణమోహన్ ని కోరారు.
దీనిపై స్పందించిన కృష్ణమోహన్ ‘మా’ ఎన్నికల నిర్వహణతోనే తన బాధ్యత పూర్తయిందని, తరువాత జోక్యం చేసుకోవడానికి తనకెలాంటి అధికారం లేదని పేర్కొన్నారు. తొలిసారి ఫుటేజ్ అడిగినప్పుడు పరిశీలిస్తానని చెప్పానని… ఇస్తానని చెప్పలేదని అన్నారు. ఇక అధికారమంతా అధ్యకుడికే ఉంటుందని తెలిపారు. ఫుటేజ్ ఇవ్వడానికి తనకు అధికారం లేదని స్పష్టం చేశారు.