బాలు కోలుకోవాలని పూజలు నిర్వహిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా వైరస్‌ బారినుంచి త్వరగా కోలుకోవాలని తెలుగు రాష్ట్రాల్లో అందరూ కోరుకుంటున్నారు. కొంతమంది దేవుళ్లకు పూజలు ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఈ నేపధ్యంలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ప్రత్యేకంగా పూజలు చేయించారు. ఆయన త్వరగా కోలుకోవాలని వెంకటేశ్వరుడ్ని వేడుకున్నారు. బాల సుబ్రమణ్యం దేశంలోనే గొప్ప గాయకుడని.. ఎస్పీ బాల సుబ్రమణ్యానికి టీటీడీతో మంచి అనుబంధం ఉందన్నారు.

ఇదిలా ఉంటే ఎస్పీ బాలు ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని చెన్నై ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. వైద్య నిపుణుల పర్యవేక్షణలో వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నామని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. కాలేయం మినహా అన్ని అవయవాలు పనిచేస్తున్నాయని.. విదేశీ వైద్యుల సూచనలతో ఎక్మో పరికరంతో వైద్యం చేస్తున్నామన్నారు. ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ కూడా బాలు ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితి ఇంకా విషమంగా ఉందని కన్నీళ్లు పెట్టుకున్నారు.