చంద్రబాబు అరెస్ట్ కు వైసీపీ మూల్యం చెల్లించుకోక తప్పదు: గురాన అయ్యలు

విజయనగరం: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును వైసీపీ ప్రభుత్వం పైశాచిక ఆనందం కోసమే అరెస్ట్ చేసిందని జనసేన నేత గురాన అయ్యలు అన్నారు. తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు జగనాసుర దహనం కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో సైకో పాలన పోవాలంటూ రాసిన పత్రాలను జనసేన పార్టీ ఆధ్వర్యంలో సోమవారం దహనం చేశారు. ఈ సందర్భంగా జనసేన నేత గురాన అయ్యలు మాట్లాడుతూ వైసీపీని ఓడించడం ద్వారానే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవచ్చని పేర్కొన్నారు. జగన్‌ లాంటి నియంతకు రాబోయే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. చంద్రబాబు పట్ల వైసీపీ ప్రభుత్వం మానవత్వం లేకుండా వ్యవహరిస్తోందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను మేనేజ్ చేస్తోందంటూ మండిపడ్డారు. చంద్రబాబు బరువుపై జైలు అధికారులు, వైద్యులు విభిన్న ప్రకటనలు చేస్తున్నారన్నారు. చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చంద్రబాబుకు చికిత్స అందించకుండా హేళన చేసేలా వైసీపీ నాయకులు మాట్లాడటం దారుణంగా ఉందన్నారు. భవిష్యత్‌లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపై వైసీపీ చేస్తున్న విమర్శలు సిగ్గుచేటన్నారు. రాజకీయ విమర్శలకు సమాధానం చెప్పే సత్తా లేకనే వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కాటం అశ్విని, అడబాల వేంకటేష్, ఎమ్. పవన్ కుమార్, వజ్రపు నవీన్ కుమార్, పృథ్వీ భార్గవ్, కంది సురేష్ కుమార్, వి.వెంకట రమణ, కె.సాయి, కంకిపాటి రాజు, సుర్యచంద్రులు, శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు.