రాష్ట్ర రాజకీయాల నుంచి వైసీపీని తరిమికొట్టాలి

• ఓట్ల కోసం పచ్చని కోనసీమలో కులాల చిచ్చు రాజేశారు
• అక్రమ కేసులు పెట్టి అమాయకులను వేధించారు
• ఆస్తుల కోసం సొంత తల్లి, చెల్లిని ఇబ్బందులుపెట్టిన వ్యక్తి జగన్
• ఆయన బుర్ర కుళ్లు, కుతంత్రాలతో నిండిపోయింది
• చరిత్రలో నిలిచిపోయేలా జనసేన ఆవిర్భావ సభ
• కలసికట్టుగా పనిచేసి సభను విజయవంతం చేద్దాం
• అమలాపురంలో ఆవిర్భావ సభ సన్నాహక సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్

‘గత పాలకులు రాజకీయ లబ్ధి కోసం పచ్చని కోనసీమలో కులాల మధ్య చిచ్చు రాజేశారు. ఓట్ల కోసం రాజేసిన ఆ చిచ్చులో ఎంతో మంది అమాయకులు బలయ్యారు. అక్రమ కేసుల్లో ఇరుక్కొని రోడ్డునపడ్డారు. సొంత మంత్రి ఇంటిపైనే దాడి చేయించిన దుర్మార్గమైన ముఖ్యమంత్రిని మనం ఏనాడైనా చూశామా..? రాజకీయాల్లో ప్రక్షాళన జరగాలి. వైఎస్ఆర్సీపీ లాంటి దుర్మార్గమైన పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో ఉండకూడద’ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం అమలాపురంలో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “కోనసీమ ప్రాంతం జనసేన పార్టీకి గుండెకాయలాంటిది. ఆనాడు మనం జెడ్పీటీసీ, ఎంపీపీ ఈ ప్రాంతం నుంచే గెలిచాం. పార్టీ క్రియాశీలక సభ్యత్వం 12.3 లక్షలకు చేరిందంటే దానిలో మెజార్టీ ఈ ప్రాంతం నుంచే నిలబడ్డారు. ఇక్కడ నియమించిన సభ్యత్వ వాలంటీర్లు ఉదయం పని చేసుకుంటూ… సాయంత్రం సభ్యత్వం చేసేవారు. ఆవిర్భావ సభ సన్నాహక సమావేశానికి ఒక మంత్రి, ఐదుగురు పార్టీ ఎమ్మెల్యేలు, ఇద్దరు కార్పొరేషన్ ఛైర్మన్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు హాజరయ్యారని తెలిస్తే శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఆనందపడతారు. ఈ స్ఫూర్తినే మనం అన్ని చోట్లా చూపించాలి.
• కుళ్లు, కుతంత్రాలకు బ్రాండ్ అంబాసిడర్
వైసీపీ అధినాయకుడు కుళ్లు, కుతంత్రాలకు బ్రాండ్ అంబాసిడర్. కోనసీమలో రాజకీయ లబ్ధి కోసం ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టారు. అక్రమ కేసులు ఆయనే బనాయించి… మళ్లీ వాటిని ఆయనే తీయించినట్లు బిల్డప్ ఇచ్చారు. సొంత మంత్రి ఇంటిపైనే దాడి చేయించి తగలబెట్టారు. ఆస్తుల కోసం సొంత తల్లి, చెల్లిని ఎలా వేధించారో మనకు తెలుసు. సోషల్ మీడియాలో 400 మంది పేటియం బ్యాచ్ ను పెట్టుకొని మన అధినాయకుడిని, వీరమహిళలను ఏ విధంగా వ్యక్తిగత దూషణలు చేయించారో గత ఐదేళ్లు మనం చూశాం. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే చాలు అక్రమ కేసులు బనాయించి వేధించారు. వీటిని ఎవరూ మరిచిపోలేదు. ఇలాంటి నాయకత్వమా రాష్ట్రానికి కావాలి..? నాయకత్వం అంటే ప్రజల కోసం స్పందించే మనసు ఉండాలి. జగన్ ఏనాడైనా జేబు నుంచి రూపాయి తీసి ఇవ్వడం ఎవరైనా చూశారా..? అదే శ్రీ పవన్ కళ్యాణ్ గారు కష్టమని వచ్చిన ప్రజలను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆదుకున్నారు. ఇలాంటి నాయకత్వాన్ని మనం బలపరచాలి. ఈ రోజు శ్రీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవలందిస్తున్నారంటే దానికి అండగా నిలబడింది జనసేన పార్టీ, శ్రీ పవన్ కళ్యాణ్ గారు. పొత్తు నిలపడం కోసం త్యాగాలు చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట కోసం మనందరం ఎంతో కష్టపడి పనిచేశాం. ఇప్పుడు అదే స్ఫూర్తితో జనసేన పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి. చిన్న చిన్న విభేదాలను పక్కన పెట్టి మనందరం కలసికట్టుగా పని చేద్దాం.
• సంక్షేమంతోపాటు అభివృద్ధి చేసి చూపిస్తాం
ఈ రోజు మనం ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నాం. ఆనాడు ప్రజలకు ఇచ్చిన మాట కోసం ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ కార్యక్రమం చేయాలన్నా వైసీపీ నాయకులు అడ్డుపడేవారు. అయినా వారి బెదిరింపులను లెక్క చేయకుండా రైతాంగం కోసం దీక్షలు చేశాం. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు అండగా నిలబడ్డాం. గత ప్రభుత్వం రైతులకు రూ.1674 కోట్ల ధాన్యం బకాయిలు పెండింగ్ పెడితే … కూటమి ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే బకాయిల సొమ్ము రైతుల ఖాతాల్లో జమ చేశాం. గతంలో ఎన్నడూ లేని విధంగా ధాన్యం కొన్న 24 గంటల్లోనే అన్నదాతల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నాం. ఇప్పటి వరకు 33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. 24 గంటల్లోనే రూ.7800 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశాం. ఏ ప్రభుత్వం అయినా ఇలా అన్నదాతలకు అండగా నిలబడిందా..? గ్రామాల్లో 3300 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేస్తున్నారు. ఒకే రోజు 13371 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. జల్ జీవన్ మిషన్ పథకం కింద ప్రతి ఇంటికి కుళాయి ద్వారా మంచి నీరు అందించాలని రూ. 80 వేల కోట్లతో ప్రణాళికలు రూపొందించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ కాకుండా కాపాడారు. పోలవరం, అమరావతికి ప్రత్యేక ప్యాకేజీలు కేంద్రం నుంచి తీసుకొచ్చారు. కూటమి ప్రభుత్వంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి చేసి చూపిస్తాం.
• న భూతో న భవిష్యత్ అన్న రీతిలో ఏర్పాట్లు
చరిత్రలో నిలిచిపోయేలా ఆవిర్భావ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సభ నిర్వహణ కోసం14 కమిటీలు ఏర్పాటు చేశాం. పర్యవేక్షణ కోసం కాకినాడలో కంట్రోల్ రూమ్ సిద్ధం చేశాం. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటిసారి చేసుకునే ఈ ఆవిర్భావ సభను అందరం కలిసికట్టుగా విజయవంతం చేయాలి. సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం నియోజక వర్గ ప్రజలు శ్రీ పవన్‌ కళ్యాణ్ గారికి అద్భుతమైన విజయాన్ని అందించారు. ఈ సభ ద్వారా వారికి కృతజ్ఞతలు తెలిపాలి. సభలో పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, అభివృద్ధి కార్యక్రమాలపై పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్, శాసన సభ్యులు పంతం నానాజీ, బొలిశెట్టి శ్రీనివాస్, గిడ్డి సత్యనారాయణ, దేవ వరప్రసాద్, రాష్ట్ర మాల కార్పొరేషన్ ఛైర్మన్ పెదపూడి విజయ్ కుమార్, రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్ చిలకలపూడి పాపారావు, ఆవిర్భావ సభ అమలాపురం పార్లమెంట్ సమన్వయకర్త బండారు శ్రీనివాస్, అసెంబ్లీ సమన్వయకర్త దుగ్గిశెట్టి సుజయ్ బాబు, రామచంద్రపురం ఇంఛార్జి పొలిశెట్టి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment