జనసేన పార్టీని చూసి వణుకుతున్న వైసీపీ: ఏపీ శివయ్య

చిత్తూరు: రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో జనసేన పార్టీపై పెరుగుతున్న ఆదరణ చూసి వైసీపీ నేతలు వణికిపోతున్నారని.. జనసేన పార్టీ చిత్తూరు జిల్లా కార్యదర్శి ఏపీ శివయ్య వ్యాఖ్యానించారు. ఇటీవల జనసేన పార్టీ కార్యకర్తల కోరిక మేరకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని చూసి వైసీపీ భయపడుతున్నదని ఆయన అన్నారు. వైసీపీ బడా నేతలు జనసేన పార్టీకి భయపడుతూ అర్ధరహిత వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. జనసేన పార్టీ ఎలా పోటీ చేయాలి.. ఎవరితో పోటీ చేయాలి.. ప్రభుత్వాన్ని ఎవరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలనేది కూడా వైసీపీ నేతలు సెలవిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు పెరిగిపోయాయని.. వాటిని చీలకుండా సమీకృతం చేయాలని చూస్తున్న జనసేన అధినేతను చూసి జడుచుకుంటున్నారని ఆయన అన్నారు. ఓడిపోతామన్న భయంతో కుల, మత, ప్రాంత వైవిధ్యాలను ప్రజల్లో వైసీపీ వారు రెచ్చగొడుతున్నారని పోర్కొన్నారు. మూడేళ్ల పాలన అస్తవ్యస్తంగా శాంతిభద్రతలకు విఘాతంగా తయారైందని విమర్శించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ తాను మంచి పాలన అందిస్తున్నానంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు క్రింది స్థాయి నాయకులను గడప గడపకు పంపి ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను వారి ఖాతాల్లో వెయ్యాలని చూస్తున్నారని విమర్శించారు.