• గత ఐదేళ్ల వైసీపీ విధ్వంసం నిన్న అసెంబ్లీ ఘటనతో మరోసారి గుర్తుకొచ్చింది
• బూతులు, దాడులు, దౌర్జన్యాలకు వైసీపీ పర్యాయపదంగా మారింది
• ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమం, అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్తున్నాం
• విశాఖ ఉక్కు పరిరక్షణ కన్నా… పంపకాలకే వైసీపీ ప్రాధాన్యమిచ్చింది
• విశాఖ ఉక్కు పరిశ్రమను వైసీపీ గాలికి వదిలేస్తే… మేము రక్షించుకున్నాం
• రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రధాని శ్రీ మోదీ నేతృత్వంలోని కేంద్రం అందిస్తున్న మద్దతు ఎనలేనిది
• గత అటవీ మంత్రి అడవుల రక్షణ కంటే భక్షణకే ప్రాధాన్యమిచ్చారు
• అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే ప్రసంగంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్
దేవాలయం లాంటి అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ప్రతులు చింపి అసెంబ్లీలో నానా యాగి చేసిన వైసీపీ నాయకులు- గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ఉండి ఉంటే కనీసం ఆయన వంక చూడడానికి కూడా భయపడేవారని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు. బూతులకు, దాడులకు, దౌర్జన్యాలకు వైసీపీ పర్యాయపదంగా మారిందని చెప్పారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మంగళవారం గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “నిన్న శాసనసభలో గవర్నర్ గారి ప్రసంగం సమయంలో వైసీపీ నేతల విధ్వంసం చూస్తే.. వివేకానందరెడ్డి గారి హత్య గుర్తొచ్చింది. నిన్న సభలో గొడవ జరుగుతుంటే.. వైకాపా విధ్వంస విధానాలు గుర్తొచ్చాయి. ప్రజావేదిక కూల్చివేసిన తీరు, 200 పైచిలుకు ఆలయాలు కూల్చివేత, డాక్టర్ సుధాకర్ చనిపోయిన విధానం, జంగారెడ్డిగూడెం కల్తీసారా మరణాలు, సుప్రీంకోర్టు జడ్జిపై లేఖ రాయడం, హైకోర్టు న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో విమర్శలు చేయడం, పత్రికాధిపతులపై దాడులు, మడ అడవుల విధ్వంసం, చంద్రబాబును 53 రోజులు జైల్లో పెట్టిన విధానం, అమరావతి రైతులను రక్తం వచ్చేట్టు కొట్టి, కేసులు పెట్టిన తీరు, తిరుపతి కల్తీ లడ్డూ ఘటనలు గుర్తొచ్చాయి. వైసీపీ అసెంబ్లీలోనే ఈ స్థాయిలో ప్రవర్తిస్తే.. బయట కూడా ఇలాంటి గొడవలే జరుగుతాయి. ఇది మారాలి అని ప్రజలకు చెబితే.. మనల్ని అత్యధిక మెజార్టీతో ఇక్కడ కూర్చోబెట్టారు. అయినా ఇప్పటికీ వైసీపీ వాళ్ళ బుద్ధి మాత్రం మారలేదు.
• గవర్నర్ అంటే అంత అగౌరవమా?
గౌరవ గవర్నర్ గారు ప్రసంగిస్తుంటే వైసీపీ నేతలు దారుణంగా ప్రవర్తించారు. ఇలాంటి నేతలను ఇన్ని సంవత్సరాలుగా శ్రీ చంద్రబాబునాయుడు గారు ఎలా తట్టుకుని నిలబడగలిగారా? అని.. నిన్నటి ఘటన తర్వాత నాకనిపించింది. ఆయనకు హ్యాట్సాఫ్.. అలాంటి వారిని ఎదుర్కోవాలంటే ఎంతో ధైర్యం, తెగువ ఉండాలి. నిన్న సభలో గొడవ చేసిన వైసీపీ నేతలు .. గవర్నర్ గారు సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు ఆయన కళ్లలోకి చూడగలిగేవారా? చట్టాలు చేయాల్సిన వారే ఉల్లంఘిస్తే ఎలా? నిబంధనలు మాకు పట్టవనేలా వైసీపీ నాయకులు ప్రవర్తిస్తున్న తీరు ప్రజలంతా గమనిస్తున్నారు. గత ఐదేళ్లుగా వారు చేసిన అరాచకాలు, దౌర్జన్యాలు, గొడవలు భరించలేకే ప్రజలు మా మీద నమ్మకంతో ఇంతటి బాధ్యతనిచ్చారు. పరిపాలనలో సమూల మార్పులు తెస్తున్నాం. ప్రభుత్వానికి తన ప్రసంగం ద్వారా దిశా నిర్ధేశం చేసిన గవర్నర్ గారికి ధన్యవాదాలు. గత వైసీపీ పాలనలో ఎన్ని ఇబ్బందులుపెట్టినా బలంగా నిలబడగలిగామంటే ప్రజలకు మంచి చేయాలన్న బలమైన ఆకాంక్షే కారణం. 2024 ఎన్నికల తర్వాత మొదటి అసెంబ్లీ సమావేశంలోనే వైసీపీ నాయకులకు తగిన గౌరవం ఇవ్వాలని సీఎం గారు అందిరికీ చెప్పారు. అదే బాధ్యతతో మేం మెలుగుతున్నాం. భవిష్యత్తులోనూ ఇదే ప్రజాస్వామ్య స్ఫూర్తిని నింపుకుని సభలో హుందాతనం ప్రదర్శిస్తాం. నిన్న సభలో వైసీపీ చేసిన రార్ధాంతానికి గవర్నర్ గారు ఇబ్బందిపడి ఉంటే ఆయనకు ప్రభుత్వం తరఫున మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను.
• విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో వైసీపీది నాటకం
గత ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడేందుకు దృష్టి పెట్టకపోగా- విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్లాట్లుగా చేసి అమ్మేసేందుకు పన్నాగం పన్నింది. గత ప్రభుత్వంలో కేంద్రానికి అన్ని బిల్లుల్లోనూ మద్దతు ఇచ్చిన వైసీపీ నాయకులు కనీసం విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడే ప్రయత్నం కూడా చేయలేదు. అడగలేదు. 32 మంది బలిదానాలతో వచ్చిన విశాఖ స్టీల్ ప్లాంటు పెట్టుబడుల ఉపసంహరణ చేయాలని కేంద్రం భావిస్తే – వైసీపీ అప్పట్లో మద్దతు తెలిపింది. అఖిలపక్షం వేయమని మేము కోరితే మా మాటను ఖాతరు చేయలేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులను, నాయకులను మోసం చేసేలా వైసీపీ నాయకులు కుటిల యత్నాలు చేశారు. మేమంతా ఆంధ్రులం అనే భావన రాష్ట్రంలో ఒక్క స్టీల్ ప్లాంట్ విషయంలోనే బలంగా వినిపిస్తుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దు అని ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారీ కేంద్ర నాయకులను కోరాము. ఉక్కు కర్మాగారాన్ని మిగిలిన పరిశ్రమల్లా చూడొద్దని, దీన్ని ఆంధ్రులందరి ఆత్మ గౌరవ సమస్యగా, భావోద్వేగ విషయంగా చూడాలని పలుమార్లు తెలిపాము. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దని బలంగా చెప్పాం. 2024లో కూటమి ప్రభుత్వం విజయం తర్వాత ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, నేను పలుమార్లు కేంద్ర పెద్దల దృష్టికి ప్రైవేటీకరణ వద్దని, ప్లాంటుని కాపాడాలని కోరడంతోనే కేంద్రం సానుకూలంగా స్పందించింది. ప్లాంటుకు సంబంధించి కేంద్రం నుంచి ఆర్ధిక సాయాన్ని పొందగలిగాము. వైసీపీ ప్లాంటు సమస్యను గాలికి వదిలేస్తే మేము గాడిన పెట్టాము. విశాఖ స్టీల్ ప్లాంట్ వాసులకు భరోసా కల్పించగలిగాము.
• అభివృద్ధిలో వడివడిగా ముందుకు వెళ్తున్నాం
గత ప్రభుత్వం రాజధాని విషయంలో మూడు ముక్కలాట ఆడింది. దొరికిన చోట దొరికినట్లు రాష్ట్ర అభివృద్ధి ఫలాలను పణంగా పెట్టి అప్పులు చేసింది. రాష్ట్ర ఆర్ధిక సుస్థిరత పూర్తిగా నాశనం అయ్యింది. ఇలాంటి కీలకమైన సమయంలో మళ్లీ రాష్ట్ర పురోభివృద్ధి కోసం ఒక ప్రణాళికతో పని చేస్తున్నాం. జవాబుదారీతనంతో ముందుకు వెళ్తున్నాం. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల్లో పల్లెపండుగ పేరుతో రూ. 4,500 కోట్లు ఖర్చు చేసి 30 వేల పనులు చేపట్టగలిగాము. వైసీపీ తన ఐదేళ్ల పాలనలో 1800 కిలోమీటర్ల సీసీ రోడ్లు వేస్తే, కూటమి ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే 4,300 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేసింది. వైసీపీ హయాంలో ఐదేళ్లలో కేవలం 267 గోకులాలు నిర్మిస్తే, కూటమి ప్రభుత్వ హయాంలో ఆరు నెలల్లోనే 22,500 గోకులాలు నిర్మించాం. జల్ జీవన్ మిషన్ నిధులను, పనులను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. పనికిరాని ప్రాంతాల్లో సైతం పైపు లైన్లు వేసి ఇష్టానుసారం బిల్లులు పెట్టుకున్నారు. ఇప్పుడు జల్ జీవన్ మిషన్ పనులను ఒక విజన్ తో పట్టాలెక్కిస్తున్నాం. మొత్తం పనుల్లో రూ. 54 వేల కోట్లు కావాలని ప్రతిపాదనలు పంపాం. దీనికి కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందని భావిస్తున్నాం. పథకం గడువు తేదీని పెంచడం ఆనందకర విషయం.
• ఎన్నికల హామీలను నెరవేరుస్తున్నాం
ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాం. రాష్ట్రంలో ఆర్ధిక సమస్యలు మెండుగా ఉన్నాయి. వాటిని అధిగమించి ముందుకు వెళ్తున్నాం. యువతలో ఉన్న నైపుణ్యాలను వెలికితీసేందుకు నైపుణ్య గణన చేస్తామని ఎన్నికల్లో చెప్పినట్టుగా కూటమి ప్రభుత్వం హామీ నెరవేరుస్తోంది. పైలెట్ ప్రాజెక్టుగా మంగళగిరి నియోజకవర్గంలో నైపుణ్య గణన జరగనుంది. పూర్తి పారదర్శకతతో తన మన తేడా లేకుండా కేవలం సమర్ధత ఆధారంగా రాష్ట్రంలోని యూనివర్శిటీలకు వీసీలను నియమించడం స్వాగతించదగ్గ పరిణామం. ఎన్నికల సమయంలో చెప్పినట్టుగా ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా అందించేందుకు కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. గత ప్రభుత్వం పింఛన్ల పెంపును ఐదేళ్లు సాగదీస్తే.. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒకేసారి రూ. వెయ్యి రూపాయిలు పెంచి ఆ హామీ నెరవేర్చాం. మహిళలకు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం కూడా వేగంగా అమలవుతోంది. రాష్ట్రంలో 50 శాతం పచ్చదనం పెంచేలా చర్యలు తీసుకుంటున్నాం. దీనికి ఓ పటిష్ట ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. మదపుటేనుగులను నియంత్రించేందుకు కుంకీ ఏనుగులు తెచ్చేందుకు కర్ణాటక ప్రభుత్వంలో మాట్లాడాం. నిన్న రాత్రి గుండాలకోన అటవీ ప్రాంతంలో జరిగిన ఏనుగుల తొక్కిసలాటలో భక్తులు మృతి చెందడం దురదృష్టకరం. అయితే కొందరు భక్తులు దగ్గర దారులు అనే భావనతో ఏనుగులు సంచరించే ప్రాంతంలోకి వెళ్లడం బాధాకరం. జనసంచారం అధికంగా ఉండే ప్రధాన దారుల్లో భక్తులు వెళ్లాలని కోరుతున్నాను.
• గత అటవీశాఖ మంత్రి 77 ఎకరాల అటవీ భూమి కబ్జా చేశారు
అటవీ శాఖ మంత్రి హోదాలో ప్రజలకు మేలు చేసి ప్రకృతి సంపద అయిన అడవులను కాపాడాలి. గత ప్రభుత్వంలోని అటవీ మంత్రి ఏకంగా 77 ఎకరాల అటవీ భూమి కబ్జా చేసి ఎస్టేట్ కట్టుకోవడం చూశాం. దీనిపై అటవీ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు లెక్కలు తేల్చిన తర్వాత చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధం, అమ్మకం విషయంలోనూ సరైన పద్దతి అవలంభించలేదు. ఇటీవల కర్ణాటక నేను వెళ్లిన సమయంలో అక్కడ అధికారులు ఎర్రచందనం తమ ప్రాంతంలో పట్టుబడినప్పుడు తామే అమ్ముకుని ప్రభుత్వ ఖజానాకు జమ చేస్తున్నట్టు చెప్పారు. దీనిపై అప్పటి ప్రభుత్వం కనీసం ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఈ విషయం కనీసం అప్పటి అటవీ శాఖ మంత్రికి కూడా తెలియదు. కేవలం భూముల కబ్జా గురించి మాత్రమే ఆలోచించే వారికి ఇవి ఎలా గుర్తు ఉంటాయి. గిరిజన ప్రాంతాల్లో డోలీల ద్వారా ఆసుపత్రులకు చేర్చే మార్గాలు రహదారులుగా మారుతున్నాయి. ఏడు దశాబ్దాలుగా రోడ్డు లేని గిరిజన గ్రామాలకు రోడ్లు వస్తున్నాయి. ఇటీవల డోలీ ద్వారా తీసుకువెళ్లే ప్రాంతాల్లో రోడ్డు రావడంతో తొలిసారి అంబులెన్సు ఆ ప్రాంతానికి చేరుకుని ఓ గర్బిణిని కేవలం 8 నిమిషాల్లో ఆసుపత్రికి చేర్చడం ద్వారా ఆమె ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనిచ్చారు. ఇది కూటమి ప్రభుత్వం గర్వంగా చెప్పుకునే గొప్ప విషయం.
• కేంద్ర ప్రభుత్వానికి.. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు
అమరావతి రాజధాని నిర్మాణానికి, పోలవరం నిర్మాణ నిధులకు అలాగే రాష్ట్ర పురోగతికి అడుగడుగునా సహకరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి నిండు మనసుతో కృతజ్ఞతలు చెబుతున్నాను. రాష్ట్రాన్ని గత ఐదేళ్లుగా చీకట్లోకి నెట్టేసిన పాలకుల పాపాల నుంచి బయటకు తీసుకువచ్చి మళ్లీ పురోభివృద్ధి దిశగా ముందుకు వెళ్తున్నాం. రాష్ట్రానికి కొత్త కంపెనీలు, పరిశ్రమలు వస్తున్నాయి. యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లుగా వికసిత్ భారత్ లో రాష్ట్రం ముందు వరసలో ఉండాలని ప్రయత్నిస్తున్నాం. ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకంలో ఆయన సూచనలు సలహాలతో కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యేలంతా రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమానికి కట్టుబడి పని చేస్తాం.
• ఎవరెన్ని మాటలన్నా మిత్రత్వం మాత్రం పొందికగా ఉంటుంది
సంకీర్ణ ప్రభుత్వంలో చాలా సవాళ్లు ఉంటాయి. రకరకాల మాటలు, అభిప్రాయాలు ఉంటాయి. కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులను పార్టీలను ఎవరెవరు ఎన్నిరకాలుగా మాట్లాడినా మేమంతా కలిసి ఒకే కుటుంబంలా ఉంటామని బలంగా చెబుతున్నాం. రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టే బాథ్యతను బలంగా తీసుకున్నాం. ఇంటికి పెద్దలాంటి గవర్నర్ గారినే ఇష్టానుసారం అగౌరవపరిచిన పార్టీలు ఉండకూడదు. ఇబ్బందులు వచ్చినా ప్రజల కోసం బలంగా నిలబడి ఉంటాం. విభిన్న అంశాల పట్ల స్వీయ నియంత్రణతో ప్రభుత్వంలో బలంగా చర్చ జరగాలి అన్న సింగపూర్ మొదటి ప్రధాని లీ క్వాన్ యూ మాటలే మాకు ఆదర్శం. అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన పార్టీ ముఖం చాటేసిన పరిస్థితిలో ప్రజల కోసం అధికార పక్షమే ప్రతిపక్షం పాత్ర పోషిస్తుంది. నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు రాష్ట్ర సంక్షేమం ప్రజల మెరుగైన జీవన విధానం కోసమే నా ఆలోచనలు ఉంటాయి. మాకు ఎప్పటికప్పుడు తగు సూచనలు చేసి రాష్ట్రాభివృద్ధిలో మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న గౌరవ గవర్నర్ గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను” అన్నారు.
Share this content:
Post Comment