కార్మికుల కన్నీళ్లలో వైసీపీ కొట్టుకుపోతుంది

  • సమ్మె నేపథ్యంలో ప్రజారోగ్యానికి హాని జరిగితే పాలకులదే బాధ్యత
  • పారిశుద్ధ్య కార్మికుల సమ్మెకు మద్దతుగా జనసేన భారీ ర్యాలీ
  • అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన

గుంటూరు: తన నియంతృత్వ పాలనతో రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని రాష్ట్రం నుంచి తరిమేసే రోజులు ఎంతో దూరంలో లేవని నగర జనసేన పార్టీ అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ అన్నారు. కార్మికుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడటం తగదన్నారు. పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మెకు మద్దతుగా బుధవారం జనసేన పార్టీ శ్రేణులు భారీ పాదయాత్ర నిర్వహించారు. కార్మికులతో కలిసి బీ ఆర్ స్టేడియం దగ్గర నుంచి నగరపాలక సంస్థ వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా నేరేళ్ళ సురేష్ మాట్లాడుతూ కార్మికుల కన్నీళ్ళు రాష్ట్ర శ్రేయస్సుకు మంచిది కాదన్నారు. కార్మికులు గొంతెమ్మ కోర్కెలేమి కోరడం లేదని ప్రతిపక్ష నేతగా ఆనాడు జగన్ రెడ్డి ఇచ్చిన హామీలనే ఇప్పుడు నెరవేర్చమంటున్నారన్నారు. అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలనే నెరవేర్చమంటే పాలకులకు ఎక్కడ లేని కోపం వస్తుందన్నారు. రాష్ట్ర కార్మిక సంఘ నాయకులు సోమి శంకరరావు మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు చేసే పనికి లక్ష రూపాయలు ఇచ్చినా తక్కువే అంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేశారు. మాకు లక్ష వద్దని మేము చేసే కష్టానికి తగ్గ భత్యాన్ని ఇమ్మంటున్నామన్నారు. కార్మికుల కాళ్లు కడిగినా వారి రుణం తీర్చుకోలేమంటూ వైసీపీ నేతలు చెబుతూనే వారి జీవితాలను కన్నీళ్లమయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేవరకూ ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదన్నారు. జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి మాట్లాడుతూ సమ్మె కారణంగా నగరం అంతా ఇప్పటికే దుర్గంధమయంగా మారిందన్నారు. పారిశుద్ధ్య లోపం కారణంగా ప్రజలు అనారోగ్యం పాలయితే దానికి పాలకులే బాధ్యత వహించాలన్నారు. కార్మికులకు అండగా జనసేన పోరాడుతుందన్నారు. కార్యక్రమంలో రెల్లి యువత నాయకులు సోమి ఉదయ్ కుమార్ , కార్పొరేటర్ లక్ష్మీ దుర్గ , యర్రంశెట్టి రాజేష్, జనసేన నగర కమిటీ సభ్యులు, డివిజన్ అధ్యక్షులు , వీరమహిళలు, టీడీపీ అనుబంధ సంస్థ టీ యన్ టీ యు సీ సభ్యులు, కార్మికులు పెద్దఎత్తున పాల్గొన్నారు.