ఏ.కే.యూ నందు యూత్ పార్లమెంట్ పోస్టర్ ఆవిష్కరణ

  • కార్యక్రమంలో పాల్గొన్న వి.సి, రిజిస్ట్రార్ తదితరులు

కేంద్ర యువజన సర్వీసులు, క్రీడల మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు స్థానిక ఆంధ్ర కేసరి యూనివర్శిటీ పరిపాలనా భవనం ముందు ఉమ్మడి ప్రకాశం జిల్లా స్థాయి యూత్ పార్లమెంట్ పోస్టర్ ను ఏ.కే.యూ ఉప కులపతి ప్రొఫెసర్ డి.వి.ఆర్ మూర్తి గురువారం లాంఛనంగా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశాభివృద్ధిలో యువతీ యువకుల భాగస్వామ్యం ఎంతో అవసరమని, మారిన కాలానికి అనుగుణంగా యువత తమ మేథా సంపత్తితో భారతావనిని ప్రపంచంలోని అన్ని దేశాల కంటే ప్రతి రంగంలోనూ ముందుకు తీసుకొని వెళ్లాలని ఆయన అన్నారు. ముఖ్యంగా యువత యూత్ పార్లమెంట్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని భవిష్యత్ లో ముందుకు సాగాలని, నేడు దేశానికి యువత అవసరం ఎంతో ఉందని, ప్రకాశం జిల్లాలోని యువత ఈ సదవకాశాన్ని వినియోగించు కొని దేశాభివృద్ధిలో పాలు పంచుకోవాలని ఏ.కే.యూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి హరిబాబు పేర్కొన్నారు. విక్రమ సింహపురి యూనివర్శిటీ నందు జరిగే యూత్ పార్లమెంట్ పోటీలలో 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన ఉన్నటువంటి ఆంధ్ర కేసరి యూనివర్శిటీ పరిధిలో గల యువత పాల్గొనవచ్చునని, అయితే ఈ పోటీలలో పాల్గొనడానికి ఆసక్తి కలిగిన యువతీ యువకులు ముందుగా ప్రతి ఒక్కరూ తప్పని సరిగా మై భారత్ పోర్టల్ నందు తమ పేర్లు నమోదు చేసుకోవాలని, అదే విధంగా ఒక్క నిమిషం కాలం నిడివి కలిగిన “వాట్ డస్ వికసిత్ భారత్ మీన్ టూ యూ ” అనే అంశం పైన వీడియో తీసి మార్చి 9వ తేదీ అర్ధరాత్రి 12 గంటలలోపు అప్లోడ్ చేయాలని ఆంధ్ర కేసరి యూనివర్శిటీ ఎన్.ఎస్.ఎస్ కో-ఆర్డినేటర్ డాక్టర్ మండే హర్ష ప్రీతం దేవ్ కుమార్ యువతీ యువకులకు సూచించారు. యూత్ పార్లమెంట్ పోటీలలో ఆంధ్ర కేసరి యూనివర్శిటీ విద్యార్థులు, ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన యువతీ యువకులు అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించి దేశ స్థాయిలో జరిగే పోటీలలో పాల్గొనే విధంగా సమాయత్తం కావాలని పలువురు వక్తలు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర కేసరి యూనివర్శిటీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రాజ మోహన్ రావు, వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్ నిర్మలా మణి, నెహ్రూ యువ కేంద్రం జిల్లా కో ఆర్డినేటర్ కమల్ షా,సహాయ ఆచార్యులు డాక్టర్ ఉబ్బా ఈత ముక్కల, జాస్మిన్ తోబాటు ఆంధ్ర కేసరి యూనివర్శిటీ ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్లు, ఏకేయూ బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

Share this content:

Post Comment