*యువత పోరు ఎవరి కోసం జగన్ రెడ్డి గారు..?
*రాష్ట్రంలో జాడలేని వైసీపీ యువత పోరు
యువత పోరు అట్టర్ ప్లాప్ అంటూ జనసేన పార్టీ నాయకురాలు తిరుపతి అనూష వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో యువత కోసం అని చెప్పుకుంటూ నిర్వహించిన ఈ కార్యక్రమం పూర్తిగా విఫలమైందని, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలను మోసం చేయడానికే ప్రయత్నిస్తోందని ఆమె మండిపడ్డారు. బుధవారం ఆమె మాట్లాడుతూ, వైసీపీ పాలనలో యువత, విద్యార్థులు, రైతులు, ఉద్యోగార్థులకు ఏమి లాభపడలేదని, గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో విద్యా వ్యవస్థ పూర్తిగా నాశనమైందని ఆరోపించారు. “బకాయిలు జగన్ రెడ్డి ప్రభుత్వం పెడితే, దానికి బాధ్యత కూటమి ప్రభుత్వంపై వేయాలని చూస్తున్నారు. ఇది ప్రజలను మరోసారి మోసం చేసేందుకు చేసిన కుట్ర మాత్రమే” అని అనూష విమర్శించారు. ఆమె మాటల్లో, “గతంలో ప్రజలు జగన్‌ను నమ్మి మోసపోయారు, కానీ ఈసారి మళ్లీ మోసపోయే స్థితిలో లేరు. సీఎం పదవిలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలను పట్టించుకోకుండా తాడేపల్లి ప్యాలెస్‌కే పరిమితమయ్యారు. ఇప్పుడిక ఎమ్మెల్యేగా బెంగళూరు ప్యాలెస్ నుంచి తాడేపల్లి ప్యాలెస్‌కు డైలీ సర్వీస్ చేస్తూ ప్రజలను పూర్తిగా విస్మరించారు” అని ఎద్దేవా చేశారు. యువత కోసం చేపట్టిన పోరాటానికి విద్యార్థులు, యువత నుండి ఎక్కడా స్పందన రాలేదని, ఆందోళన విజయవంతం చేయడానికి వైసీపీ నాయకులు బలవంతంగా కొందరిని రోడ్లపైకి తీసుకురావాల్సి వచ్చిందని చెప్పారు. వైసీపీ నిర్వాకాన్ని అసెంబ్లీలో ఎండగట్టిన లోకేష్: “ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించని వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా యువత పోరు పేరుతో మోసం చేయాలని చూస్తోంది” అని మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో ఆరోపించారు. గుడ్లకు రూ.200 కోట్లు, చిక్కీలకు రూ.60 కోట్లు, ఆయా, నైట్ వాచ్‌మెన్ జీతాలకు రూ.65.21 కోట్లు, క్లీనింగ్ మెటీరియల్స్‌కు రూ.22.69 కోట్లు, అడిషనల్ మెనూ కోసం రూ.3.90 కోట్లు, విద్యా దీవెన రూ.2,832 కోట్లు, వసతి దీవెన రూ.989 కోట్లు, పీజీ విద్యార్థులకు రూ.450 కోట్లు బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిల్లో రూ.788 కోట్లు కూటమి ప్రభుత్వం చెల్లించిందని, ఫీజు రీయింబర్స్‌ను ఎత్తివేసిన జీవో నెంబర్ 77 తెచ్చిన పాపం వైసీపీ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. బలవంతంగా రోడ్లపైకి: విద్యార్థులు, యువత స్పందించకపోవడంతో కొన్ని చోట్ల డబ్బులిచ్చి కొందరిని బలవంతంగా రోడ్లపైకి తీసుకురావాల్సి వచ్చిందని, ఆ వ్యక్తులు కూడా “కూటమి వర్థిల్లాలి” అంటూ నినాదాలు చేయడంతో వైసీపీ నేతలు అవమానానికి గురయ్యారని తెలిపారు. పైగా, యువత పోరులో అధినేత కానీ, అగ్రనాయకత్వం కానీ పాల్గొనలేదని ఎద్దేవా చేశారు. సోషల్ మీడియాలో కూడా వైసీపీ కార్యక్రమంపై తీవ్రంగా ట్రోల్స్ జరిగాయి. “పింఛన్‌లకు అప్లై చేసుకునే వయసులో ఉన్నవారు యువత పోరు అంటుండడం హాస్యాస్పదం” అంటూ నెటిజన్లు సెటైర్లు వేశారు. తిరుపతి అనూష వ్యాఖ్యలు: జనసేన పార్టీ యువత భవిష్యత్తును మెరుగుపరిచే విధంగా కృషి చేస్తుందని, వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉందని ఆమె తెలిపారు. వైసీపీ పాలనలో యువత భవిష్యత్తును నాశనం చేశారని, ఈసారి ప్రజలు మోసపోవడం అనుమానమేనని తేల్చిచెప్పారు.
Share this content:
Post Comment