కళ తప్పిన వైఎస్సార్ జల కళ!

*ఉచిత బోర్ల తవ్వకంలో చతికిలపడ్డ ప్రభుత్వం
*బిల్లులు చెల్లించకపోవడంతో బోర్ల తవ్వకాలు నిలిపివేసిన కాంట్రాక్టర్లు
* తాజాగా మరోసారి టెండర్లు పిలిచిన సర్కార్
* ఎన్నికల స్టంటే అని పెదవి విరుస్తున్న రైతులు

త్వరలో మీ రైతు ప్రభుత్వం అధికారంలోకి రాబోతోంది. మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చిన్న, సన్నకారు రైతులందరికీ ఉచితంగా బోర్లు తవ్వించడంతోపాటు, ఉచితంగా మోటార్లు బిగించి, ఉచితంగా విద్యుత్ కనెక్షన్ కూడా ఇస్తామంటూ 2019 ఎన్నికలకు ముందు, ఆ తరువాత జగన్ రెడ్డి హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ఆర్బాటంగా పథకం ప్రారంభించారు. నాలుగేళ్లు గడచినా ఆశించిన స్థాయిలో అడుగు ముందుకు పడలేదు. మరో ఏడాదిలో ఎన్నికలు రానున్న వేళ ప్రభుత్వం బోర్ల తవ్వకాలకు మళ్లీ టెండర్లు పిలిచి ఇప్పుడు ఆర్భాటం చేస్తోంది. వేసవి కాలం మొత్తం వదిలేసి వర్షాకాలం సమీపిస్తుండగా టెండర్లు ఆహ్వానించారంటేనే వైఎస్ఆర్ జలకళ పథకం అమలుపై ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని అర్థం అవుతోంది. ఇది మరో ఎన్నికల స్టంట్ ఏమోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
*సిద్ధమైన బోర్లు 25 మాత్రమే
2019 ఎన్నికల ముందు, ఆ తరువాత చిన్న, సన్నకారు రైతులందరికీ ఉచితంగా బోర్లు, విద్యుత్ కనెక్షన్ తో పాటు, మోటార్లు కూడా అందిస్తామని అప్పటి ప్రతిపక్షనేత, ప్రస్తుత సీఎం జగన్ రెడ్డి హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే పథకాన్ని5 ఎకరాల్లోపు రైతులకు పరిమితం చేయడంతోపాటు, కనీసం మూడెకరాలు ఒకే చోట ఉండాలనే నిబంధన పెట్టారు. దీంతో చాలా మంది రైతులకు ఈ పథకం వర్తించలేదు. అయినా 2,30,758 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం 2 లక్షల బోర్లు తవ్వించేందుకు సిద్దమంటూ ప్రకటించింది. ఇందుకుగానూ ప్రతి నియోజకవర్గానికి ఒక రిగ్గును ఏర్పాటు చేస్తున్నట్టు 2020 సెప్టెంబరు 28న సీఎం జగన్ రెడ్డి వైఎస్ఆర్ జలకళ పథకం ప్రారంభ కార్యక్రమంలో చెప్పారు. అయితే గడచిన నాలుగేళ్లలో తవ్విన బోర్లు 21150 మాత్రమే. అంటే పథకం ప్రారంభించిన 32 మాసాల్లో నెలకు సగటున 660 బోర్లు తవ్వారు. ఇదే విధంగా ముందుకెళితే ఇంకా మిగిలిపోయిన 1,78,850 బోర్లు తవ్వేందుకు 22 సంవత్సరాలు పడుతుంది. గడచిన 32 మాసాల్లో తవ్విన బోర్లు 21150 కాగా అందులో మోటార్లు బిగించి సిద్ధం చేసినవి కేవలం 25 మాత్రమే కావడం గమనార్హం.
*బిల్లులు ఇవ్వకపోవడంతో చేతులెత్తేసిన కాంట్రాక్టర్లు
నాలుగేళ్లలో రూ.2340 కోట్లు ఖర్చు చేసి 2 లక్షల బోర్లు ఉచితంగా తవ్విస్తామని 2019 ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టిన జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఆ విషయం మరచిపోయారు. 2020 నుంచి బోర్లు తవ్విన కాంట్రాక్టర్లకు సరిగా బిల్లులు చెల్లించకపోవడంతో గత ఏడాది ఏఫ్రిల్ నుంచే బోర్ల తవ్వకం నిలిపివేశారు. బోర్లు తవ్వే కాంట్రాక్టర్ల టెండర్ గడువు ముగియడంతో తాజాగా మరోసారి టెండర్లు పిలిచారు. వ్యవసాయ భూముల్లో బోర్ల తవ్వకాలకు సహజంగా నవంబరు నుంచి మే చివరి వరకు అనుకూలంగా ఉంటుంది. వేసవి కాలం చేయాల్సిన ఈ పనులను ఇప్పటి దాకా గాలికొదిలేసి, వర్షాకాలం ప్రారంభం కాగానే టెండర్లు పిలిచారు. అసలు ప్రభుత్వానికి జలకళ పథకం అమలు చేసే ఉద్దేశం ఉందా అనే అనుమానం కలుగుతోంది. కేవలం ఎన్నికల్లో రైతులను మరోసారి మోసం చేసేందుకు వేస్తున్న ఎత్తుగా అనుమానించాల్సి వస్తోంది. వర్షాకాలం పొలాల్లోకి బోరు యంత్రాలు వెళ్లే అవకాశం లేదు. బోర్లు వేయాలంటే మరో నాలుగైదు నెలలు వేచి చూడాల్సిందే. ఆ తరవాత ఎన్నికల హడావుడి మొదలవుతుంది. ఆ గందరగోళంలో కాంట్రాక్టర్లు బోర్లు తవ్వించే అవకాశం అంతగా ఉండదేమో.
*విద్యుత్ కనెక్షన్ ఖర్చు రైతులే భరించాలట….
బోర్ల తవ్వకమే నత్తనడకను తలపిస్తోంది. తవ్విన బోర్లకు విద్యుత్ కనెక్షన్ ఇచ్చేందుకు అసలు ప్రభుత్వం నిధులే విడుదల చేయలేదు. గడచిన మూడేళ్లలో ప్రభుత్వం తవ్వించిన 21 వేల బోర్లకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చేందుకు కనీసం రూ.1000 కోట్లు ఖర్చవుతుంది. అయితే ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విదల్చకపోవడంతో జలకళ పథకం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. ఒక్కో బోరుకు కరెంటు సదుపాయం కల్పించేందుకు రూ.5 నుంచి రూ.10 లక్షలు ఖర్చువుతుందని విద్యుత్ ఇంజనీర్లు చెబుతున్నారు. ఈ మొత్తాన్ని రైతులే భరించాలని ప్రభుత్వం ప్రకటించడంతో సన్న చిన్నకారు రైతులు ఆందోళన చెందుతున్నారు. జలకళ పథకం వెలుగు నింపుతుందని రైతులంతా భావించారు. చివరకు చీకట్లే మిగిలాయని రైతులు వాపోతున్నారు.
*సీఎం సొంత జిల్లాలోనూ ఇదే తీరు
సీఎం జగన్ రెడ్డి సొంత జిల్లాలోనూ జలకళ పథకం ఒక అడుగు ముందుకు, మూడు అడుగులు వెనక్కు అన్న చందంగా తయారైంది. ఉమ్మడి కడప జిల్లాలో 16,606 మంది రైతులు బోర్ల కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. తవ్విన బోర్లు మాత్రం కేవలం 1130 మాత్రమే. సీఎం సొంత జిల్లాలోనే పరిస్థితి ఇంత అధ్వానంగా తయారైతే, ఇక మిగిలిన జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. శ్రీకాకుళంలాంటి వెనకబడ్డ జిల్లాల్లో అయితే కనీసం వెయ్యి బోర్లు కూడా తవ్వలేదని ప్రభుత్వ గణాంకాలే వెల్లడిస్తున్నాయి. వైఎస్ఆర్ జలకళ పథకం అమల్లో మొదటి నుంచి ప్రభుత్వం చిత్తశుద్ధి చూపలేదు. ఒక్కో బోరు తవ్వడం, విద్యుత్ సదుపాయాలు, పంపుసెట్ ఏర్పాటు చేసేందుకు కనీసం రూ.7 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంటే 2 లక్షల బోర్లు తవ్వి, అన్ని సదుపాయాలు కల్పించి, మోటార్లు బిగించేందుకు కనీసం ప్రభుత్వం రూ.14000 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కనీసం ఏటా రూ.3000 కోట్లు ఖర్చు చేస్తే ఐదేళ్లలో అనుకున్న లక్ష్యం చేరుకునే అవకాశం ఉంది. ప్రభుత్వం గడచిన నాలుగేళ్లలో పట్టుమని రూ.1000 కోట్లు కూడా ఖర్చు చేసిన పాపాన పోలేదు. దీంతో బిల్లులు రాక బోర్ల తవ్వకాలను కూడా కాంట్రాక్టర్లు మధ్యలోనే నిలిపేశారు.
*స్పందించని గుత్తేదారులు
నాలుగేళ్ల నుంచి వైఎస్ఆర్ జలకళ పథకాన్ని అటకెక్కించిన ప్రభుత్వం తాజాగా మరలా టెండర్లు పిలిచింది. వర్షాకాలం వచ్చిన తరవాత టెండర్లు పిలవడంలో ఆంతర్యం అర్థం చేసుకోవచ్చు. పథకం అమలు చేస్తున్నట్టు మభ్య పెట్టడానికి తప్ప, వర్షాకాలంలో అడుగు ముందుకు పడే అవకాశం లేదు. వర్షాకాలం తరవాత ఎన్నికల హడావుడి మొదలవుతుంది. చివరి ఏడాది పనులు చేస్తే బిల్లులు వచ్చే అవకాశం తక్కువ. మరలా ఇదే ప్రభుత్వం అధికారంలోకి రాకపోతే, ఇక బిల్లులు రావడం మరింత కష్టం అవుతుంది. అందుకే ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించినా కాంట్రాక్టర్లు స్పందించడం లేదని తెలుస్తోంది.