అమల్లోకి రానున్న 10+2 ఎడ్యుకేషన్‌ విధానం

రాష్ట్రంలో10+2 ఎడ్యుకేషన్‌ విధానం అమల్లోకి రానున్నది. వీలైతే వచ్చే విద్యాసంవత్సరం నుంచే అన్ని పాఠశాలల్లో 11వ, 12వ (ఇంటర్‌) తరగతులు ప్రారంభం కానున్నాయి. జాతీయ విద్యావిధానం (ఎన్‌ఈపీ) ప్రకారం పాఠశాల విద్య పరిధిలోకి ఇంటర్‌ తరగతులు రావాలి. రాష్ర్టంలో ప్రాథమిక, ఉన్నత, మాధ్యమిక విద్యావిధానం కొనసాగాల్సి ఉన్నది. ఈ విధానంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో విద్యాశాఖ అధికారులతో సమావేశం జరిగింది. వీలైనంత త్వరలోనే దీనిపై ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నది.

అన్ని స్కూళ్లలో ఒకేసారి కాకుండా దశలవారీగా 10+2 విద్యను అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు. ఇదే జరిగితే సీబీఎస్‌ఈ బోర్డు తరహాలో ఎస్సెస్సీ బోర్డు కీలకంగా మారనున్నది. అన్ని పరీక్షల నిర్వహణ బాధ్యత దీని పరిధిలోకి వస్తుంది. ఇంటర్‌ విద్యామండలి ఎస్సెస్సీ బోర్డులో విలీనమయ్యే అవకాశం ఉన్నది.